
Botsa Satyanarayana latest news(AP news live) : అభివృద్ధి, పాలన విషయంలో కొంతకాలంగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ మధ్య ఏపీ రోడ్లు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. అప్పుడు ఏపీ మంత్రులు ఘాటు రిఫ్లై ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తారు. ఈ వివాదం కొన్ని రోజులు హాట్ హాట్ గా సాగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ మరో వివాదాన్ని రేపాయి.
విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన సమయంలో తెలంగాణ విద్యా వ్యవస్థపై మంత్రి బొత్స వ్యంగంగా మాట్లాడారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని తెలిపారు. ఇలా పరోక్షంగా TSPSC వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అంటూ బొత్స వ్యాఖ్యానించారు.
ఏపీ మంత్రి బొత్స చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తెలంగాణ విద్యావ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. అలాకాకపోతే వెంటనే బొత్సను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.