
Latest Onion rates in telugu states(Today news paper telugu) :
మొన్న వరకు టమాటా ధరలు సామాన్యులను బెంబేలెత్తించాయి. ఆ తర్వాత అరటి పళ్ల ధరలు కొండెక్కాయి. ఇప్పుడు ఉల్లి రేట్ ఘూటెక్కుతోంది. సామాన్యులను ఉలికిపాటుకు గురి చేస్తోంది. రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.30కు చేరింది. మాల్స్, చిల్లర దుకాణాల్లో రూ.35 -40 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లకు సరుకు చాలా తక్కువగా వస్తోంది. దీంతో ఉల్లి రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మార్చి నుంచి జూలై వరకు ఉల్లి ధర దాదాపు నిలకడగా ఉంది. కిలో రూ. 15-20 మధ్య అమ్మకాలు జరిగాయి. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ. 40కి చేరింది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. దీంతో మార్కెట్లకు డిమాండ్ తగ్గ సరకు రావడం లేదు. కర్ణాటకలోనూ కొత్త పంట అందుబాటులో లేదు. దీంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.
తాడేపల్లిగూడెం మార్కెట్‌కు సాధారణంగా రోజుకు 80 నుంచి 90 లారీలు ఉల్లి వస్తుంది. కానీ ప్రస్తుతం 2 లారీల సరకు మాత్రమే వస్తోందని వ్యాపారులు అంటున్నారు. 15 రోజుల నుంచి నాఫెడ్ ద్వారా రోజూ 15 లారీల ఉల్లి సరఫరా చేస్తున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణతోపాటు హైదరబాద్ లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉల్లి ధరల నియంత్రణకు ఇప్పటికే కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ధరలు పెరగకుండా కళ్లెం వేయగలిగింది. అయినాసరే క్రమక్రమంగా ఉల్లి రేటు పెరుగుతోంది. ఇప్పుడు ఉల్లి రేట్ కూడా టమాటాలాగే పెరుగుతుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి రేట్ కూడా సెంచరీకి చేరుతుందనే అంచనా ఉంది.