
Pawan Kalyan with BJP(Political news telugu):
2018 తెలంగాణ అసెంబ్లీ ఎనిక్నలలో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈ సారి ఎన్నికలలో మాత్రం విజయం తమదే అని గొప్పలు చెబుతున్నా.. లోలోపల కనీసం గౌరవ ప్రదమైన స్థానాలనైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయతే ఈ సారి బీజేపీ తన సొంత బలంతోపాటు సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాపులారిటీనీ కూడా ఉపగించబోతోంది.
పవన్ కల్యాణ్ అధినేతగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీతో ఆంధ్ర ప్రదేశ్‌లో పొత్తు పెట్టుకున్న బీజేపీ అదే స్నేహాన్ని తెలంగాణ ఎన్నికలకూ ఉపయోగించబోతోంది. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు అంతంత మాత్రమే. అది కూడా అభ్యర్థుల ఇమేజ్‌తోనే పార్టీ నెట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2018లో గోషామహల్‌తో ఒకేఒక్క విజయం దక్కినా.. ఆ తరువాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు లభించినా అది బీజేపీ బలం కాదు.. అభ్యర్థుల బలమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
కానీ రాబోయే 2023 తెలంగాణ ఎన్నికల్లో కనీసం 25-50 సీట్లు గెలిస్తే తప్ప బీజేపీ తన ఉనికిని కాపాడుకోలేదు. ఈ క్రమంలోనే పవన్‌ను తమకు తురుపు ముక్కలా వినియోగించుకోవాలనే భావనతో బీజేపీ నాయకత్వం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇంతగా ఆధారపడిన పవన్‌ను ఎలా చూసుకోవాలి? ఏ విధంగా ఆయనను మచ్చిక చేసుకోవాలి? అనే అంశాలు కీలకంగా మారాయి. కానీ, బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం పవన్ కల్యాణ్‌ని ప్రస్తుతానికి ఉపయోగించుకొని పక్కన పెట్టేలా కనిపిస్తోంది.
ఎందుకంటే టికెట్ల నుంచి చర్చల వరకు కూడా.. పవన్‌తో బీజేపీ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. కనీసం 20 స్థానాల్లో అయినా తమకు అవకాశం ఇవ్వాలని జనసేన అడుగుతుంటే.. ఈ విషయాన్ని బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే జనసేన పోటీ చేయాలని అనుకుంటున్న స్థానాల్లో తన అభ్యర్థులను ఖరారు చేసింది. పైగా జనసేనకు అత్యంత అవమానకర రీతిలో 4 స్థానాలను మాత్రమే కేటాయిస్తామని బీజేపీ పెద్దలు చెప్పారట. తాజాగా అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారనే టాక్ వినిపిస్తోంది.
పవన్‌పై ఆధారపడి.. పవన్ ఇమేజ్‌ను వినియోగించుకునేందుకు సిద్ధపడిన బీజేపీ నాయకులు.. ఇలా చేయడం ఏమేరకు సమంజసమనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ ఈ అవమానాన్ని కేవలం ఏపీ ఎన్నికల కోసమే సహిస్తున్నారని అర్థమవుతోంది.
కానీ బీజేపీ తీరు చూస్తుంటే తెలంగాణ ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో సహాయపడుతుందా? అనే విషయంలో కూడా సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు జనసేన, టీడీపీ జట్టులో కలిసినట్టు అధికారికంగా ప్రకటించలేదు. పైగా బీజేపీ ఢిల్లీ పెద్దలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ మధ్య దోస్తీ ఉందనే టాక్ ఎప్పటి నుంచే నడుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఎంతవరకు బీజేపీ భారాన్ని మోయగలడో? చూడాలి మరి!
Revanth Reddy : కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్.. రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..