
Pawan Kalyan : సమాజ సేవ కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని మరోసారి స్పష్టం చేశారు. డబ్బు కోసం కాదని తేల్చి చెప్పారు. వరంగల్ నిట్‌లో వసంతోత్సవం కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశలో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లలేదని తెలిపారు. అయినా నిత్య విద్యార్థినిగా ఉన్నానని వివరించారు. నిట్ విద్యార్థులకు పవన్ సూచనలు ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో చెప్పారు. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దని సూచించారు. నేడు విఫలమైనా.. రేపు తప్పకుండా గెలిచి తీరుతామని చెప్పారు. ఇలా తన రాజకీయ అనుభవాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఓటములను ఎదురైనా జీవితంలో గెలుపు కోసం ఎలా పోరాడాలో విద్యార్థులకు హితోపదేసం చేశారు.
సినిమా వల్ల తనకెంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఖుషీ సినిమా తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడదామని ఇమ్మిగ్రేషన్ పేపర్స్ కూడా సిద్ధం చేసుకున్నానని నాటి సంగతులను గుర్తు చేశారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నానని వివరించారు. కష్టమో… నష్టమో దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు బాధలు, ఆదిలాబాద్ తండాల్లో గిరిజనుల తాగునీటి కష్టాలు ఇలాంటివి తనను కదిలించాయన్నారు. అలాంటి బాధితులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని పవన్ వెల్లడించారు.
సైంటిస్టులు చేసే ఆవిష్కరణలు సమాజానికి ఎంత వరకు మేలు చేస్తున్నాయన్నదే ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. కలరా బాధితుల ప్రాణాలు నిలుపుతున్న ‘ఓఆర్‌ఎస్’ ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్ దిలీప్ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు గొప్పవి అని పేర్కొన్నారు.పేటెంట్లు వచ్చినంత మాత్రాన ఆవిష్కరణ గొప్పది కాదని అన్నారు. సమాజానికి ఉపయోగపడితేనే ఆ ఆవిష్కరణలకు విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తుండగా విద్యార్థులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు స్పల్ప లాఠీఛార్జి చేశారు. కార్యక్రమం ముగిశాక పవన్ వేదిక దిగుతుండగా రద్దీని నియంత్రించే క్రమంలో కాజీపేట ఎస్‌ఐ శ్వేత కింద పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు.