
Telangana: ‘కాంగ్రెస్‌కి కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమికి పని చేసింది’. ఈటల రాజేందర్ చేసిన ఈ కామెంట్లు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించాయి. ఈటల ఏదో రోటీన్‌గా రాజకీయనేతలంతా అన్నట్టుగానే ఏదో అనేశారు. కానీ, అక్కడున్నది రేవంత్‌రెడ్డి మరి. ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నారు. తడిబట్టలతో భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దాం రా.. అంటూ ఈటలకు సవాల్ విసిరి రాజకీయాన్ని మరింత రగిలించారు. రేవంత్ నుంచి ఈ స్థాయిలో రిటార్ట్ వస్తుందని ఈటల ఊహించలేకపోయారు. తీసుకున్న డబ్బులకు ఆధారాలు, లెక్కాపత్రాలు ఉంటాయా? అంటూ ఈటల సేఫ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ, అప్పటికే ఎంతోకొంత డ్యామేజ్ జరిగిపోయింది. కేసీఆర్ డబ్బులిచ్చారని, కాంగ్రెస్ తీసుకుందని.. అనుకునే వాళ్లు అనుకున్నారు. అంతా అలా ఫిక్స్ కాకుండా ఉండేందుకే రేవంత్‌రెడ్డి ప్రమాణం సవాల్ చేసి నష్ట నివారణ చేపట్టారు.
రాజకీయాల్లో ట్రెండ్‌గా మారిందా?
రేవంత్‌రెడ్డి కాబట్టి.. వెంటనే రియాక్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేదంటే? తెలంగాణలో ఇలాంటి బట్ట కాల్చి మీదేసే రాజకీయాలు ఓ ట్రెండ్‌గా మారాయంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. నేతలంతా తాడుబొంగరం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు అడుగుతారులే? ఏం చేస్తారులే? ఏం అవుతుందిలే? అనే ధీమా కాబోలు. ఏదో ఒకటి అనేయడం.. అది మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా రావడం.. సోషల్ మీడియాలో హల్‌చల్ కావడం.. అంతా గంటల వ్యవధిలో గడిచిపోతుంది. ఒకరికి ఫుల్ మైలేజ్. మరొకరికి ఫుల్ డ్యామేజ్. ఆ తర్వాత తమ మీద పడిన బురదను కడుక్కోలేక, తుడుచుకోలేక.. సదరు నేత సతమతం కావాల్సిందే.
కేసీఆర్ కుటుంబమే టార్గెట్?
మెయిన్‌గా కేసీఆర్ కుటుంబంపై జోరుగా సాగుతోంది ఇలాంటి దాడి. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు చేశారని.. బాత్‌రూమ్ కిటికీలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నారని.. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని.. TSPSC పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తం ఉందని.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని.. ఇలా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వీటిలో నిజాలూ ఉండొచ్చు.. ఆరోపణలూ కావొచ్చు. అవి తేలడం ఎప్పటికో. దాదాపు అసాధ్యం కూడా. కానీ, ఆలోగా ఓ ఆరోపణ రాగానే.. ఆ మేరకు జరగాల్సిన పొలిటికల్ డ్యామేజ్ జరిగిపోతుంది. నిజం నిరూపితమయ్యేలోగా.. అబద్దం సమాజాన్ని చుట్టేస్తుంది. మెజార్టీ పబ్లిక్ నిజమేనని ఫిక్స్ అయిపోతారు. అదే కదా ఆరోపణలు చేసే వారికి కావాల్సింది కూడా.
రేవంత్‌కూ తప్పని తిప్పలు..
రేవంత్‌రెడ్డి సైతం పలుమార్లు బాధితుడయ్యారు. అధిష్టానానికి 100 కోట్లు ఇచ్చి.. పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైసలు తీసుకుని పదవి ఇచ్చి.. కాంగ్రెస్ భవిష్యత్తును హైకమాండ్ అమ్ముకుంటుందా? ఎవరు సమర్థులో.. ఎవరిని చీఫ్ చేస్తే పార్టీకి లాభమో.. అదే చేస్తుంది అధిష్టానం. కానీ, తనకు పదవి రాలేదనే అక్కస్సో, మరే కారణమో తెలీదుకానీ.. కోమటిరెడ్డి అలా అనేశారు. ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నారు.
రేవంత్‌పై ఆరోపణల్లో నిజమెంత?
ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చూసిన వాళ్లు ఉండరు.. చెప్పిన వాళ్లు ఉండరు.. ఏదో అనేశారు. కేసీఆర్.. రేవంత్‌రెడ్డికి 25 కోట్లు ఇచ్చారని. కామెడీ కాకపోతే మరేంటి? కేసీఆర్, రేవంత్‌లు ఉప్పు-నిప్పు లాంటి వాళ్లు. తనను జైల్లో పెట్టించారనే కసితో రేవంత్ రగిలిపోతున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. అదే జైల్లో పెట్టాలనే పంతంతో పని చేస్తున్నారు. అందుకే సర్వంఒడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కేసీఆర్ సైతం రేవంత్‌ను తొక్కేసేందుకు మాగ్జిమమ్ ఎఫెక్ట్ పెడుతున్నారు. అసలు, రేవంత్-కాంగ్రెస్ ఎదగకుండా చేసేందుకే కేసీఆర్ బీజేపీని హైప్ చేస్తున్నారని అంతా అంటుంటే.. ఈటలనేమో కేసీఆర్, రేవంత్‌కు 25 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేస్తే జనం నమ్మేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వాదులు. ఓ మాట అనేద్దాం.. ఆ తర్వాత ఏమైతదో చూద్దాం.. అన్నట్టు ఉంది ఈ ధోరణి.
కమలనాథులనూ వదలని ఆరోపణలు..
బీజేపీ నేతలు సైతం ఇలాంటి ఆరోపణలకు బాధితులే. కరీంనగర్ గ్రానైట్ మాఫియా నుంచి బండి సంజయ్ వందల కోట్లు వసూలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రఘునందన్.. పటాన్‌చెరువు పరిసర ప్రాంతాల పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకున్నారని కూడా అన్నారు. ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు ఆక్రమించారని కేసులు పెట్టారు. 18వేల కోట్ల కాంట్రాక్టుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయారంటూ విమర్శలు వచ్చాయి. రాష్ట్ర నేతలే కాదు.. అసలు బీజేపీ మనుగడే అదానీ, అంబానీ చేతుల్లో ఉందని.. అదానీ, మోదీకి బినామీ అంటూ కాంగ్రెస్ పదే పదే ఊదరగొడుతోంది. మొయినాబాద్ ఫాంహౌజ్‌లో పైలైట్ రోహిత్‌రెడ్డితో సహా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని వీడియో ఫూటేజ్ బయటకు వచ్చింది. ఆ ఘటనతో బీజేపీకి సంబంధం లేదంటూ బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసే వరకూ రాజకీయం నడిచింది.
పాలి..ట్రిక్స్ కామనేనా?
పాలి..ట్రిక్స్‌లో ఇలాంటి విమర్శలు, ఆరోపణలు కామన్ అనేలా మారాయి పరిస్థితులు. సందర్భాన్ని బట్టి.. టాపిక్‌ను బట్టి.. కొన్నిసార్లు ఇలాంటి ఆరోపణలు భారీగా డ్యామేజ్ చేస్తుంటే.. మరికొన్నిసార్లు అంతా లైట్ తీసుకుంటున్నారు. తక్కువ సార్లు మాత్రమే కోర్టులు, పరువునష్టం కేసుల వరకూ వెళ్తోంది. డ్రగ్స్ ఎపిసోడ్‌లో, TSPSC పేపర్ లీకేజీ ఆరోపణల్లో.. మంత్రి కేటీఆర్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రమాణం చేద్దాం రా అంటూ ఈటలకు సవాల్ చేయాల్సి వచ్చింది. అట్లుంటది మరి రాజకీయాల్లో.