Country Alcohol: మద్యం మత్తు..కుటుంబాలు చిత్తు..

Country Alcohol : మద్యం మత్తు..కుటుంబాలు చిత్తు..

Country Alcohol: మద్యం మత్తు..కుటుంబాలు చిత్తు
Share this post with your friends

Country Alcohol: గ్రామగ్రాన మద్యం కోరలు చాచి విస్తరిస్తుంది.రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలపై పగబట్టిమరీ కాటేస్తోంది. దీంతో.. ముందుకు పోతే బాయి.. వెనక్కిపోతే చెరువు అన్నచందంగా మారాయి వారి బతుకులు. తెలంగాణలో గుప్పుమంటున్న గుడుంబా మహమ్మారి కాటుకు విలవిలలాడుతున్న వారి కథలేంటో బిగ్ టీవీ జనతా గ్యారేజ్ స్పెషల్ లో తెలుసుకుందాం.

పచ్చని పల్లెలను మద్యం మంటలు దహించివేస్తున్నాయి. ఓ పక్కనాటుసారా మరోపక్క బెల్ట్ షాపులు.. ఎన్నోకుటంబాలకు ఊరితాడు బిగిస్తున్నాయి. కష్టాల కల్లోలంలోకి నెట్టేస్తున్నాయి. గ్రామంలో మంచినీరు దొరకని చోట కూడా.. మద్యం ఎరులై పారుతున్నది.. బడుగుజీవుల ప్రాణాలను నిత్యం వేటాడుతున్నది.

పల్లెలు పచ్చగా ఉంటే అందం. అక్కడ స్వచ్ఛమైన జలాలు పారితే.. ప్రకృతి పులకరిస్తుంది. పుష్కలంగా పంటల సిరులు కురుస్తాయి. మరి అదే పల్లెల్లో గుడుంబా బట్టీలు వెలిస్తే, బెల్ట్ షాపులు బోరువిడిచి మద్యం విషాన్ని చిమ్మితే.. ఆ ఊర్లన్నీ జీవచ్చవాలతో నిండిపోయి స్మశాన నిశబ్దాలకు నెలవవుతాయి. బతుకులు చితికిపోయి.. పచ్చని కాపురాలు పాడెక్కుతున్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణలోని కొన్నిజిల్లాల్లోని పల్లెల్లో ములుగు, నల్గొండ , సూర్యాపేట, వరంగల్ , జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణ పేట, వనపర్తితో సహా చాలా జిల్లాల్లోని పల్లెపల్లెనా .. గుడుంబా కోరలు చాస్తూనే ఉంది.

నిండా ముప్పై ఏళ్లు కూడా నిండని రజిత అనే ఆమెది అంతులేని వ్యథ. కట్టుకున్న భర్త , మామగారు , కన్నతండ్రి , తోడబుట్టిన ఇద్దరు అన్నతమ్ముళ్లు ఇలా ఐనవారందిరినీ కోల్పోయి దిక్కులేని పక్షిగా మిగిలింది. ఈమె జీవితమనే వైకుంఠపాళిలో గుడుంబా పెద్దపాముగా మారి.. ఒక్కొక్కరిగా అందరినీ బలితీసుకున్నది. రజిత భర్త పేరు శ్రీను. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీను తాపీమేస్త్రీ పనిచేసేవాడు. రోజుకూలీ తెస్తేనే కుటుంబానికి నోటికి ముద్ద దొరికే పరిస్థితి. పెళ్లికి ముందు నుంచే శ్రీనుకు మద్యం తాగే అలవాటు ఉంది. తన రోజు కూలీలో కొంతడబ్బు ఇంట్లో ఇచ్చి.. మిగతావి మద్యం తాగేవాడు. పెళ్లిఅయ్యాక కూడా అతనిలో మార్పు రాలేదు. భార్య రజిత ఎన్నిసార్లు నచ్చజెప్పినా అతను మారలేదు. అదే తాగుడు మత్తుకు బానిసై అనారోగ్యం పాలయ్యాడు. రాజును బతికించుకునేందుకు 3లక్షలు అప్పుచేసి మరీ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించింది రజిత. ఐనా.. ఫలితం లేకపోయింది. రజితను ఆదుకునేందుకు వెనకాముందు ఎవరూ లేరు. తన అన్నలిద్దరినీ గుడంబా మింగేసింది. అదే గుడంబా కాటుకు తండ్రి, మామ కూడా బలయ్యారు. ఓ భర్త పోయి .. మరోవైపు నా అన్నవాల్లెవరూ లేక.. తన బతుకును తలుచుకొని ఏడ్చి ఏడ్చి రజిత కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయాయి. అప్పులు నెత్తిన పడి ఒంటరిగా బతుకీడుస్తున్న రజితను కదిలిస్తే.. ఆమె ఒక్కో మాట గుండెను పిండేసే వ్యథను ఆవిష్కరిస్తుంది.

విన్నారుగా .. గుడుంబా ధాటికి గూడు చెదిరి చెల్లాచెదురవుతున్న వారి జీవితాల వ్యథలు. అమ్ముకునేటోడు లాభం చూసుకుంటున్నడు. మరి తాగేటోల్లు పానం కోసం ఎందుకు ఆలోచించరు అన్న రజిత ప్రశ్నకు బదులు చెప్పేదెవరు.? ఆ సోయిలేకనే ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు మద్యం రక్కసికి బలవుతున్నాయి. గుండబా రక్కసి కోరలకు చిక్కి గోడమీద ఫోటోలోకెక్కిన వ్యక్తి రవి. వెంకన్న అనే వ్యక్తి తమ్ముడే రవి. కటిక పేదరికంలో ఉన్నా రోజు చేసే కష్టాన్ని మరవడానికి గుడంబాని తాగేవారు అన్నదమ్ములు. ఈ తాగుడు మానేయమని భార్యలు ఎంత పోరినా, బతిమిలాడినా వినలేదు. క్రమంగా రవి రెండుపూటలు తాగనిదే ఉండలేని పరిస్ధితికి చేరుకొని.. అలా అనారోగ్యం కోరల్లో చిక్కుకొని మరణించాడు. తమ్ముడు చనిపోయినా కూడా వెంకన్నకు సోయిరాలేదు. ఇప్పటికీ పొద్దున్నే మెహం కడగగానే గుండంబా తెచ్చుకోవడం తాగడమే పని. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని వారి సోదరి ఆవేదన చెందుతున్నది.

వీళ్లనే కాదు ఈ తాగుడు వ్యససానికి తెలంగాణ జిల్లాల్లో ఎందరో బలవుతూనే ఉన్నారు. మద్యం ఊబిలో చిక్కి.. తాము మునిగి చస్తూ.. కుటుంబాలను కూడా నడిరోడ్డున పడేస్తున్నారు. తాగుబోతులు చావుఎలా ఉన్నా .. వారి భార్యలు, అమ్మ అక్కా చెల్లెల్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. చిన్న వయస్సులో వైధవ్యం పోయి కొందరు.. చదువుకోవాల్సిన వయస్సులో కుటుంబభారం మీదపడి మరికొందరు మహిళలు.. బతుకుతో, సమాజంతో ఒంటరి పోరాటం చేస్తున్నారు.

గుడుంబా బట్టీలు, బెల్ట్ షాపుల యజమానుల కాసుల కక్కుర్తి .. ఎన్నో కుటుంబాలకు శాపంగా మారుతున్నది. తాగుడుకు బానిసైన తమ భర్తలు, తండ్రులు, అన్నదమ్ములను మార్చుకోలేకపోయిన మహిళలు.. గుడుంబా కాసేవారిని, బెల్ట్ షాపులు నడిపేవారిని కలిసి .. తమ వాళ్లకు మద్యం, గుడుంబా విక్రయించవద్దని కాళ్లావేళ్లా పడ్డా వాళ్లు కనికరించడం లేదు. మా వ్యాపారం మాదేనంటున్నారు. దీంతో.. కళ్లముందే ఇంట్లో వారు తాగుడుకు తగలబడిపోతుంటే ఏం చేయలేక.. మహిళలు కన్నీరుమున్నీరవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

లక్ష్మి అనే మహిళది మరో కథ.పెళ్లయిన నాటి నుంచి భర్త తాగి తందనాలాడేవాడు. కుటుంబ భారాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో లక్ష్మి కూలిపనులు చేసిమరి పిల్లలను పెంచుకుంది. ఓ రోజు భర్త అదేపనిగా తాగితాగి పడిపోయాడు.ఆస్పత్రికి తీసుకెళితే.. పక్షవాతంతో చేయి, మాటపడిపోయింది.విసర్జనలపై నియంత్రణ ఉండదని చెప్పారు. దీంతో పనులు మాని భర్తకు సేవచేయడమే పనిగా మారిపోయింది. దీంతో.. బతకు మరింత నరకంగా మారిందని ఆవేదన చెందుతున్నది.

పల్లెల్లో గుడుంబా, మద్యం విశృంఖలమైంది. తాగడం ఓ నిత్యకృత్యమైంది. మందుబాబులం మేం మందుబాబులం అని పాడుకోవడం సరదాగా భావిస్తున్నారు. ఆ సరదా వెనక వారిని కణం కణంగా కబళిస్తున్న మద్యం ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నారు.

ఇవాళ రేపు భార్యాభర్త కష్టం చేస్తేనే కుటుంబం వెళ్లదీయలేని పరిస్థితి. అలాంటిది సంపాదనలో అధికశాతం గుడంబాకే ఖర్చుపెట్టేస్తుంటే..ఇక పెళ్లాం పిల్లల గతి ఎలా? పిల్లలకు చదువు, కనీస సదుపాయాలు కాదు కదా .. సరిగా తిండికూడా పెట్టలేని దుస్థితి. ఐనా.. ఇంట్లో మొగవాళ్లకు సోయి రావడం లేదు. తెల్లారింది మొదలు.. రాత్రి దాకా .. పనిచేశామా, కూలీ తీసుకున్నామా.. గుడుంబా బట్టికి చేరామా ఇదే వ్యాపకంగా మారంది. తమ గొంతుల్లోకి దిగుతున్న మత్తు చుక్కలు.. తమ కుటుంబానికి విషం చుక్కలని గుర్తించలేకపోతున్నారు. తండ్రులు ఇలా ఉంటే వారి యుక్తవయసు పిల్లలు ఇదే తామూ అనుసరిస్తున్నారు. గుండంబా బట్టిల వైపో లేకా బెల్టు షాపుల వైపో చూస్తున్నారు.

అసలు గుడుంబా ఎందుకు తాగుతారంటే.. చీప్ అండ్ కిక్ ఎక్కువ ఇస్తుందంటున్నారు మందుబాబులు. 20 రూపాయలకు పావుసేరు అంటే క్వాటర్ సీసా నిండ, 50 రూపాయలు పెడితే కడుపునిండా తాగొచ్చు ఇదే తాగుబోతుల లాజిక్. కాస్తా ఎక్కువ సంపాధించేవారు బెల్టు షాపుల బాట పడుతున్నారు. బయ్యక్కపేట గ్రామాన్నే తీసుకుంటే.. జనాభా 800 లోపే. బెల్టుషాపులు 5 గుడంబా బట్టీలు 15 దాకా ఉన్నాయంటే.. తాగుడు జోరుకు వేరే లెక్కలు కావాలా. తాగుడు మానరా అంటే.. మానము కాక మానము అంటున్నారు. సర్కారే అగ్గువకు మద్యం అందుబాటులోకి తేవాలని కొత్త డిమాండ్ చేస్తున్నారు.

గుడుంబా కుటుంబాలనే కాదు.. గీత కార్మికుల వృత్తిని కూడా దెబ్బతీస్తున్నది. కల్లు చెట్టునుండి వస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ దీని ధర కంటే కూడా గుడంబా చాలా చవక. దీంతో.. జనం గుడుంబాను గుటకలేస్తున్నారు. కల్లుకు గిరాకీ తగ్గిపోయింది. నిజానికి గుడుంబా ఆరోగ్యానికి తీవ్ర హానికరం. తయారీ లో కూడా అడ్డమైన చెత్త, కెమికల్స్ వాడుతారు.ఇవి అందరికీ తెలుసు. తెలిసీ తాగుతున్నవారికి ఏం చెప్పగలమన్నదే అందరి ఆవేదన.

గుడంబా తయారీ ఓ చిన్నపాటి కుటీర పరిశ్రమగా మారింది. బట్టీలలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తుంటారు. రకరకాల పదార్థాలు, పండ్ల తొక్కలు, బెల్లం, పటిక కలిపి మురగపెట్టి.. దాన్ని పొయ్యిమీద పెట్టి వండుతారు. అందులోనుంచి వచ్చే ఆవిరిని సీసాల్లో సేకరిస్తారు. అదే గుడంబా. స్వచ్ఛమైన నీటి మాదిరి కనిపించే .. భయంకర మత్తు గరళమిది. నాటుగానే కాదు పరమ ఘాటుగా కూడా ఉంటుంది దీని రుచి. గూడంబాని పాత మద్యం సీసాల్లో పోసి.. కొలతల ప్రకారం అమ్ముతుంటారు.

గుడంబా తాగే వారిలో అత్యధికం నిరుపేదలు, అల్పాదాయ వర్గాలే. దీంతో.. పల్లెల్లో కుటుంబాలు చిద్రమవుతున్నాయి. మరి ఊరిలో గుడుంబా కోరలు చాస్తుంటే.. గ్రామపెద్దలు ఏం చేస్తున్నారు? అరికట్టడం వారి బాధ్యత కాదా? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. తాము చాలాసార్లు గుడుంబా బట్టిల దగ్గరికి వెళ్లి హెచ్చరించామని.. కొన్ని సార్లు బట్టీలను కూడా పగలగొట్టామంటున్నారు. ఐనా చాటుమాటుగా గుడుంబా కాస్తూనే ఉన్నారు. తాగేవాళ్లు వెళ్లి షేర్లకు షేర్లు తాగి వస్తున్నారంటున్నారు. గట్టిగా అడిగితే ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నది. మమ్మల్ని మీరేంది అపుడని రివర్సైతున్నారట.

గుడంబా గురించి ప్రశ్నిస్తే చాలు తెలంగాణాలో అధికారులు ఇంతెత్తున్న లేస్తారు. అసలు తెలంగాణలో గుడంబా ఉందా అని ఎదురు ప్రశ్నిస్తారు. ఇప్పటిదాకా మనం చూసినవి గుడుంబా బట్టీలు కావా ? అక్కడ కాస్తున్నది గుడుంబా కాదా? ఇదే మాట నిలదీస్తే .. మళ్లీ నోరెత్తరు. అసలు అధికార పార్టీ నేతలు గ్రామాలకు వెళితే కదా.. పల్లెల్లో గుడుంబా, మద్యం ఎలా ఏరులా పారుతుందో తెలిసేది. ఈ మహిళల ముందుకు వచ్చే దమ్ము ఏ రాజకీయ నేతలకుంది?ఇదే అడుగుతున్నారు ఇక్కడి మహిళలు

గుడుంబా వ్యాపారం పెంచుకునేందుకు బట్టీదారులు ఖాతా ఆఫర్ చేయడం తాగుబోతులకు మరో అవకాశంగా మారింది. ఉద్దెరకు గుడుంబా పోస్తున్నారు. వారి ధీమాకు కారణం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. గుడుంబా తాగేవారిలో చాలావరకు పెద్దవయస్సు వారే. వారికి వృద్ధాప్య పింఛనో, రైతు బంధు లేదా మరొకటో డబ్బులు ఠంచన్ గా వారి అకౌంట్ లో పడతాయి.వాటినే గుడుంబా బట్టీల వాళ్లకు వీళ్లు కట్టేస్తుంటారు. ఇదో సైక్సిక్ ప్రాసెస్. మొత్తంగా సర్కారు సంక్షేమం కోసం ఇస్తున్న మొత్తాలు .. గుడుంబా బట్టీల పాలవుతున్నాయన్నమాట.

పోనీ గుడుంబా బట్టీలను ధ్వంసం చేస్తే ఈ తాడుగు వ్యవహారం ఆగుతుందా అంటే.. అది కాని పనే అంటున్నారు జనం. మద్యం ధరలు పేదలకు అందుబాటులో లేకుండా పోయాయి. వీటికి బెల్ట్ షాపుల ట్యాక్సులు అదనం. మొత్తం కలిపి క్వార్టర్ కు తక్కువలో తక్కువ 220 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో.. అంత ఖర్చుపెట్టలేక .. అంతే మొత్తం గుడుంబాను కేవలం 50కే తాగుతున్నారు. మరి వీళ్లు ఇప్పటికిప్పుడు ఈ అలవాటు మానలేరు. మరి వారి బడ్జెట్ లో మద్యం సరఫరా చేయలేదు ప్రభుత్వం. అసలు దీనిపై సర్కారుకు సోయే లేదు. దీంతో… ఇదో చిక్కుమడి వ్యవహారంగా మారింది. అదే గుడుంబా బట్టీదారులకు వరంగా మారుతున్నది.

పచ్చని పసుపుతాడులు తెగిపడుతున్నా.. ఎందరో ఇల్లాల్లు కంటతడి పెడుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. మెండిచెయ్యోడికి నూకలు బుక్కనేర్పినట్టు .. ఓపక్క మద్యం ధరలు పెంచి.. పరోక్షంగా గుడంబాను పారించేందుకు డోర్లు తెరిచిందే సర్కారు విధానం. దీంతో ఊరుఊరునా మద్యం మంచినీళ్లలా పారుతున్నది.

కేసీఆర్ సర్కారుకు మద్యం అమ్మకాలపై ఒక సామాజిక ధృక్పధమనేదే లేదని మండిపడుతున్నారు.కేవలం ఆదాయవనరుగానే చూస్తూ.. పేదల రక్తంతో ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మద్యం ధనదాహానికి.. ఎన్ని కుటుంబాల్లో కల్లోలం రేగుతుందో పట్టడంలేదని దుయ్యబడుతున్నారు. గుడుంబాని,చీఫ్ లిక్కర్ ను నియంత్రించడం మాని.. ప్రభుత్వమే ఏకంగా తాగండి తాగించండని మద్యాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామాజికవేత్తలు విమర్శిస్తున్నట్టే .. మన రాష్ట్ర సర్కారు మద్యం ఆదాయంపైనే బండి లాగుతున్నది. ఏటా ఎక్సైజ్ ఆదాయం 46 వేల కోట్ల కు పైమాటే. అంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేస్తున్న మొత్తానికి .. మద్యం ద్వారా లాగుతున్న ఆదాయం సమానమన్నమాట.ఈచేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాగేసుకుంటోందన్నమాట. బొక్కసం నింపుకునేందుకు ప్రజారోగ్యం తో చెలగాటం ఆడుతోంది రాష్ట్రసర్కారు అంటున్నారు సమాజికవేత్తలు. నిజంగా గుడంబాను నియంత్రించే ఉద్దేశముంటే.. ధూల్ పేట లో అవలంభించిన కఠిన విధానాలెందుకు అమలుచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

మొత్తంగా తెలంగాణ పల్లెల్లో గుడుంబా అనేది అడ్డూ అదుపూ లేని వ్యాపారంగా మారుతున్నదన్నది మనం కళ్లారా చూస్తున్న నిజం. మరి దీనికి అంతం ఎప్పుడు.? ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత కాదా? బంగారు తెలంగాణ అంటున్న పాలకుల ముక్కులకు .. పల్లెల్లో గుప్పుమంటున్న గంజాయి వాసన సోకట్లేదా? ఇంకెంత కాలం మద్యం కాష్టంపై మనుషులను నిత్యం తగలేస్తూ.. డబ్బులు దండుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం సర్కారుకు ఉందా?

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Employees :దేశంలోనూ 25 వేల మంది ఉద్యోగుల ఫైర్

Bigtv Digital

New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ముదిరిన వివాదం.. 19 విపక్ష పార్టీలు బహిష్కరణ..

Bigtv Digital

Vrudda Kashi: కాశీ కన్నా పురాతమైన క్షేత్రం ఎక్కడుంది.

Bigtv Digital

E-race: దూసుకెళ్తున్న ఈ-రేస్ కార్లు.. సందడి చేసిన సచిన్, రామ్‌చరణ్

Bigtv Digital

Cock Fight: జల్లికట్టుకు ఓకే.. మరి, కోడి పందాలకు..?

Bigtv Digital

Tea : టీ తాగితే బరువు పెరుగుతారా?

BigTv Desk

Leave a Comment