
Kommidi Narsimha Reddy: ఓసారి సర్పంచ్‌గా గెలిస్తే చాలు.. ఎక్కడ లేని దర్జా ఒలకబోసే నేటి యుగంలో ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు కూడా కట్టుకోలేని నేతగా మిగిలారు.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి. సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా, భువనగిరి ఎమ్మెల్యేగా రెండు దఫాలు సేవలందించిన కొమ్మిడి ప్రజా సమస్యలే ఎజెండాగా 83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, మర్రి చెన్నారెడ్డి లాంటి దిగ్గజ నేతల సాహచర్యమూ ఉన్నా.. ఏనాటి వాటిని తన వ్యక్తిగతానికి వాడుకోలేదు. ప్రస్తుతం భువనగిరిలో అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న కొమ్మిడి ఆదర్శ ప్రస్థానం ఇదీ..
ఏటికి ఎదురీదిన నేత..!
నేటి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నర్సింహారెడ్డి 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
తొలిదశ తెలంగాణ పోరాటసమయంలో 1969లో బ్రాహ్మణ పల్లి సర్పంచ్‌గా ఉన్నారు. స్వగ్రామంలో వారసత్వంగా వచ్చిన భూములను పేదలకు పంచారు.
అనంతరం 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక.. 1983లో వచ్చిన ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని రెండవసారి భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు.
నాదెండ్ల భాస్కరరావు ఉదంతం తర్వాత వచ్చిన 1985 మధ్యంతర ఎన్నికల్లో కొమ్మిడి నర్సింహారెడ్డి వ్యక్తిత్వం విని తెలుసుకున్న సీఎం ఎన్టీఆర్ ఆయనను పిలిచి.. టీడీపీ సీటిస్తానని బతిమిలాడినా.. పార్టీ మారనంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.
రాజకీయాల్లో ధనం ప్రభావం పెరగటంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ.. ప్రజల సమస్యలేవి ఉన్నా.. నేటికీ వాటికి గొంతుకనిస్తున్నారు.
ఆ డబ్బొస్తే.. ఇల్లు కట్టుకుంటా
83 ఏళ్ల వయసులో సైతం ఆయన ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. స్థానిక సమస్యలతో పాటు గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు.
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ, నిమ్స్, సీసీఎంబీ కోసం గతంలో ఆమరణ దీక్ష చేశారు.
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నర్సింహారెడ్డి గతంలో బజాజ్ చేతక్ మీదే తిరిగేవారు. వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం స్కూటర్‌ను వాడడం లేదు.
ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనూ హైదరాబాద్‌లో అసెంబ్లీకి, సీఎం ఇంటికి, సచివాలయానికి ఆయన స్కూటర్ పైనే వెళ్లేవారు.
ఆయన సొంత భూమిని బొల్లేపల్లి కాల్వ తవ్వడం కోసం ప్రభుత్వం తీసుకుంది గానీ నేటికీ పరిహారం ఇవ్వలేదు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాననీ, ఆ సొమ్ము వస్తే.. చిన్న సొంతిల్లు నిర్మించుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం అందలేదని వాపోయారు.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు వందలమంది సహచరులు, అభిమానులు ఉన్నప్పటికీ.. ఎవరినుంచీ ఏమీ ఆశించని నేతగా ఆయన నిలిచారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని నేటికీ ఆచరిస్తున్న ధన్యజీవి.. నర్మింహారెడ్డి.
Jeevan Reddy : కేసీఆర్‌పై విమర్శలు.. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం!