
Anand mahindra latest tweet(Sports news today India):
వరల్డ్ కప్ ఫైనల్ 2023.. ఈ టైటిల్ ఈసారి కచ్చితంగా టీమిండియానే సొంతం చేసుకుని.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని కోట్లాదిమంది ఎంతో ఆశగా ఎదురుచూశారు. అందరి ఆశలపై కంగారూలు నీళ్లు చల్లి.. ఆరోసారి జగ్గజేతగా నిలిచి కప్ ను ఎగరేసుకుపోయారు. టీమిండియా ఓటమి పాలైనా.. వారు ప్రయత్నించడంలో తప్పేమీ లేదంటూ వారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఓటమి తర్వాత.. రోహిత్, కోహ్లీ, సిరాజ్ లు కన్నీరుపెట్టుకున్న దృశ్యాలు వైరల్ అవుతుండగా.. అవన్నీ నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. పట్టరాని దుఃఖంతో రోహిత్ మైదానాన్ని వీడగా.. కోహ్లీని అనుష్కశర్మ ఓడించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇండియా ఓటమిపై నేను నేర్చుకున్న పాఠం ఇదేనంటూ ట్వీట్ చేశారు. అలాగే టీమ్ ఇండియా అద్భుతంగా రాణించిందని పేర్కొన్నారు. అణకువ, వినయాలను నేర్పించడంలో క్రీడలను మించిన గురువు ఎవరూ లేరన్నారు. టీమిండియా ఆశించినదానికంటే ఎక్కువ విజయాలే సొంతం చేసుకుందని.. ఈ కష్టకాలంలో మనమంతా టీమిండియాకు సపోర్ట్ గా ఉండాలని తెలిపారు.
“జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాలి, స్వీకరించాలి. ఆ భావాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. నేను నేర్చుకున్నది ఇదే. కాబట్టి నా పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ ఫొటోను షేర్ చేస్తున్నా” అంటూ ఆనంద్ మహీంద్రా ఓ పిక్ షేర్ చేశారు. ఈ ట్వీట్ ను ఇప్పటి వరకూ 8.84 లక్షల మంది వీక్షించగా.. నెటిజన్లు బాగా చెప్పారు సర్ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.