
After Retirement Schemes:- పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉండాలి. మంచి రాబడి ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా హామీ కూడా ఉండాలి. రిటైర్మెంట్ తరువాత కూడా నెలనెలా ఆదాయాన్ని ఇచ్చేలా ఉండాలి. అలాంటి స్కీమ్‌లు చాలా ఉన్నాయి. వాటిలో ముందుగా తెలుసుకోవాల్సింది. అటల్ పెన్షన్ యోజన పథకం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ పథకం ద్వారా పదవీ విరమణ చేసిన తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఎంచుకునే పాలసీని బట్టి నెలకు వెయ్యి నుంచి 5వేలు పెన్షన్ తీసుకోవచ్చు. దీని వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాలు. 20 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది.
రెండోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పథకం కింద ప్రస్తుతం 7 శాతానికంటే ఎక్కువ వడ్డీ వస్తోంది. ప్రతి ఏటా ఈ వడ్డీ శాతం మారుతూ ఉంటుంది. ఇందులో కనీసం 500 రూపాయల నుంచి లక్షన్నర వరకు పెట్టొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్‌లోనూ ఈ స్కీమ్ సేవింగ్స్ చూపించుకోవచ్చు.
ఇక మూడోది.. నేషనల్ సేవింగ్స్ స్కీమ్. ఇండియన్ పోస్ట్-ఆఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ప్రస్తుతం సంవత్సరానికి 6.8% వడ్డీ ఇస్తోంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు.
గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. లాక్ ఇన్ పిరియడ్ ఐదేళ్లు. ఆదాయ పన్ను సెక్షన్ 80C ప్రకారం లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
నాలుగోది.. నేషనల్ పెన్షన్ స్కీమ్. సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ బెనిఫిట్ పథకం. ఈ పథకం పాలసీదారులకు వారి పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పెన్షన్ అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. పైగా ఈక్విటీలు లేదా ప్రభుత్వ సెక్యూరిటీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది. సెక్షన్ 80CCD (1B) కింద పన్ను మినహాయింపులకు అర్హులు.
ఐదోది.. సావరిన్ గోల్డ్ బాండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం తరపున గోల్డ్ బాండ్స్ జారీ చేస్తుంది. ఈ పథకం కింద ఇన్వెస్టర్లు.. ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత బాండ్లను నగదు రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఇష్యూ ధరపై సంవత్సరానికి 2.5 శాతం ఫిక్స్డ్ వడ్డీ రేటు ఈ వడ్డీ ప్రతి 6 నెలలకు ఒకసారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది.
ఆరోది.. ప్రధాన మంత్రి వయ వందన యోజన. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ భరోసా ఇవ్వడానికి ఈ పథకం తీసుకొచ్చారు. ఇందులో వడ్డీ రేట్ల తగ్గుదల నుంచి పెట్టుబడికి రక్షణ కూడా లభిస్తుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్లాన్ 10 సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన 3 సంవత్సరాల తర్వాత లోన్ సౌకర్యం పొందవచ్చు పాలసీదారుని మొత్తం కుటుంబ ఆదాయం ఆధారంగా పెన్షన్ పరిమితి నిర్ణయిస్తారు.
ఏడోది.. ప్రభుత్వ సెక్యూరిటీలు. ఈ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. సెక్యూరిటీలను బట్టి 91 రోజుల నుండి 40 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై రుణ సౌకర్యం కూడా ఉంది. అయితే, సెక్యూరిటీల విషయంలో నిబంధనలు, షరతులు మారుతూ ఉంటాయి. సో, సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా అధ్యయనం చేయాలి.