
Car Plane : కారులా రయ్యిన పరుగులు తీసి.. ఆపై విమానంలా మారి రివ్వున ఎగిరిపోతే? అద్భుతంగా లేదూ? సగం కారు.. సగం విమానం.. కలగలిస్తే శ్యామ్‌సన్ స్కై స్విచ్‌బ్లేడ్! ఇలాంటి ఫ్లయింట్ స్పోర్ట్ కార్లు అందుబాటులోకి వచ్చే రోజు మరెంతో దూరం లేదు. డిజైనింగ్, టెస్టింగ్ కోసం 14 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన అనంతరం స్విచ్ బ్లేడ్ టెస్ట్ ఫ్లయిడ్ విజయవంతమైందని ఆ సంస్థ సీఈవో శామ్ బాస్‌ఫీల్డ్ వెల్లడించారు.
వాషింగ్టన్ మోసెస్ లేక్‌లోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలిసారిగా ఈ టెస్ట్ ఫ్లయిట్ నిర్వహించారు. 500 అడుగుల ఎత్తులో ఆరు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం ఫ్లయింగ్ కార్ విజయవంతంగా లాండ్ అయింది. ట్రావెల్ రంగంలో స్విచ్‌బ్లేడ్ కారు విప్లవాత్మక మలుపు కానుంది. 10 గంటల రోడ్డు ప్రయాణాన్ని మూడున్నర గంటలకు కుదించగల టెక్నాలజీ ఇది.
అయితే ఈ ఫ్లయింగ్ కారు సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టమే. అంచనా ధర 1.7 లక్షల డాలర్ల వరకు ఉండొచ్చు. అయినా దీనికి డిమాండ్ బాగానే ఉంది. 57 దేశాల నుంచి అప్పుడే 2300 కార్లకు ఆర్డర్ వచ్చేసిందట. మూడు చక్రాలుండే ఈ స్విచ్‌బ్లేడ్‌ను కారు మోడ్‌లో లేదంటే ప్లేన్ మోడ్‌లో నడపొచ్చు. అంటే ఇంటి నుంచి కారు మోడ్‌లో ఎయిర్ పోర్టుకి వెళ్లి..అక్కడ నుంచి ప్లేన్ మోడ్‌లో రివ్వున ఎగిరిపోవచ్చన్నమాట.
ఒక మోడ్ నుంచి మరో మోడ్‌లోకి మారేందుకు దాదాపు 3 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో తోక సాగి విచ్చుకుంటుంది. ముడుచుకున్న రెక్కలూ తెరుచుకుంటాయి. కారు స్పీడ్ గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఆకాశయానంలో ఆ వేగం 322 కిలోమీటర్లకు చేరడంతో పాటు 13 వేల అడుగుల ఎత్తుకి చేరుతుంది.
ఈ ఫ్లయింగ్ కారు హైబ్రిడ్ పవర్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 91-ఆక్టేన్ పంప్ గ్యాస్‌తో నడుస్తుంది. 125 లీటర్ల ఇంధన ట్యాంక్ ఒకసారి నింపితే.. 805 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. టెస్ట్ ఫ్లయిట్ విజయవంతమైన నేపథ్యంలో వీటి తయారీపై శ్యామ్‌సన్ కంపెనీ దృష్టి సారించింది.
.
.
.