
Amazon : ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు. ఈ-కామర్స్ సంస్థలు వచ్చిన తర్వాత కస్టమర్లు దుకాణాల వెంట తిరగాల్సిన బాధ తప్పింది. కాలు బయటపెట్టకుండానే కావాల్సినవన్నీ నేరుగా ఇంటికే చేరతాయి. అమెజాన్ అయితే ఓ అడుగు ముందుకేసింది.
ఆన్‌లైన్‌లో కార్లను సైతం ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలని నిశ్చయించింది. ఈ సదుపాయం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఈ-కామర్స్ వేదిక ద్వారా కార్లను అందజేస్తున్న తొలి సంస్థ అదే. ఈ మేరకు దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తమ సైట్ ద్వారా కార్లను విక్రయించేందుకు డీలర్లను అనుమతించనుంది.
హ్యుండాయ్ డీలర్లు వచ్చే ఏడాది నుంచి అమెజాన్ సైట్ ద్వారా విక్రయించే కార్లను లిస్ట్ చేయనున్నారు. అయితే అమెజాన్‌లో కారు ఆర్డర్ చేసి.. చెల్లింపులు జరిపిన తర్వాత వినియోగదారులు తమకు సమీపంలోని షోరూం నుంచి డెలివరీ తీసుకోవచ్చు. లేదంటే నేరుగా ఇంటికి డెలివరీ చేసే సదుపాయమూ ఉంటుంది. అయితే ఎండ్ సెల్లర్ కూడా డీలరే కావడం ఇక్కడ కీలకం. కస్టమర్‌కు, డీలర్‌కు అనుసంధానకర్తగా మాత్రం అమెజాన్ ప్లాట్‌ఫాం ఉంటుంది.
అయితే తమ సైట్‌లో లిస్టింగ్ విషయమై ఇతర కార్ల తయారీ కంపెనీలతో అమెజాన్ సంస్థ సంప్రదింపులు ఏవైనా జరుపుతున్నదా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. హ్యుండాయ్‌తో ఒప్పందంలో భాగంగా.. ఆ కంపెనీ కార్లలో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
టెస్లా ఇప్పటికే డైరెక్ట్-టూ-కన్స్యూమర్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు టెస్లా కార్లను ఆ సంస్థ వెబ్‌సైట్ నుంచే నేరుగా కొనుగోలు చేయొచ్చు. డీలర్‌షిప్‌ల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకే టెస్లా ఈ పద్దతిని ప్రవేశపెట్టింది.
దీనిని వ్యతిరేకిస్తూ అమెరికాలో డీలర్‌షిప్ అసోసియేషన్లు పలు రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించాయి. అయితే హ్యుండాయ్‌తో అమెజాన్ చేసుకున్న ఒప్పందం విషయంలో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. కార్ల అమ్మకపు ప్రక్రియలో డీలర్ల ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గకపోవడమే దీనికి కారణం.