
Employees in 2023:టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. కానీ వాటికి ప్రాణం పోసే ఉద్యోగులకే జాబ్ గ్యారంటీ లేకుండా పోయింది. లేఆఫ్స్ అంటూ భయపెడుతున్నాయి. ఉద్యోగం ఉంటుందో లేదోననే టెన్షన్ వెంటాడుతోంది. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఒకవైపు లేఆఫ్స్ భయం… మరోవైపు ఏదో సాధించాలనే తపన. వీటి మధ్య ఉద్యోగులు పడుతున్న మానసిక సంఘర్షణ అంతాఇంతా కాదు. మొన్నటిదాకా ఒకచోట ఉద్యోగం ఊడితే… మరో చోట వెతుక్కోవచ్చులే అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడది లేకుండా పోయింది. ఎలాన్ మస్క్ పుణ్యమా అని అందరూ వరుస పెట్టి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయం, మరోవైపు కరోనా పొంచివున్న కరోనా మహమ్మారితో ఎంప్లాయిస్ నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే అనేక సంస్థలు తీసేసిన ఉద్యోగుల సంఖ్య లక్ష దాటినట్లు సమాచారం. ఇక ఇన్నాళ్లు చాలా సేఫ్ అనుకున్న గూగుల్ కూడా కోత మొదలు పెడుతోంది. వచ్చే ఏడాది 6 శాతం ఉద్యోగులను రోడ్డున పడేయడానికి గూగుల్ రెడీ అవుతోంది. అటు అమెజాన్ కూడా లేఆఫ్స్ బాంబ్ పేల్చింది.
ఉద్యోగుల భారం దించుకోడానికి కంపెనీలు రకరకాల సాకులు వెతుకుతున్నాయి. కాస్ట్ కటింగ్ అనో… ఉద్యోగుల పనితీరు బాగోలేదనో చెబుతున్నాయి. కానీ ఉద్యోగుల పనితీరు బాగోలేదనడం మాత్రం కరెక్ట్ కాదంటారు ఎంప్లాయిస్. ఎందుకంటే దశలవారీగా ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. కొన్నేళ్లపాటు కంపెనీలో పనిచేసిన సీనియర్లను కూడా పనితీరు బాగోలేదనే నెపం నెట్టి ఇంటికి పంపించడమేంటనే ప్రశ్న వస్తోంది. నిజంగా పనితీరు సరిగా లేకపోతే ఇన్నాళ్లు ఎలా భరించారంటే సమాధనం ఉండదు.
గత వారం గూగుల్ తన ఉద్యోగులతో సమావేశం నిర్వహించింది. అందులో ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో 6 శాతం మంది అంటే దాదాపు 10 వేల మంది పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న లిస్ట్ లో ఉన్నట్లు గూగుల్ అంచనా వేసింది. 22 శాతం మంది ఎంప్లాయిస్ పనితీరు బాగుందని గూగుల్ నివేదిక వెల్లడించింది. మరికొందరు ఉద్యోగులు సంస్థ తెచ్చిన కొత్త వర్క్ కల్చర్ లో విధానపరమైన, సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని నివేదిక తెలిపింది.