
Hair Extensions : మగువ అందంలో కురుల పాత్ర ఎంతో ప్రత్యేకం. అయితే.. నేడు మహిళల్లో మూడొంతుల మంది కేశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వృత్తిపరంగా వేషధారణకు పెరిగిన ప్రాధాన్యంతో మహిళా ఉద్యోగులు కేశాలంకరణపై బాగానే ఖర్చు పెడుతున్నారు. దీన్నే బిజినెస్ పాయింట్‌గా పట్టుకున్నారు రిచా, రైనా అనే హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు. కేశాల వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతూ.. కొత్త చరిత్ర రాస్తున్నారు.
రిచా గ్రోవర్ బద్రుకా, రైనా గ్రోవర్ భారత్‌లో హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లకు (సవరాలు) పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి, 2019లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘1 హెయిర్ స్టాప్’ (1 Hair Stop) పేరుతో తమ బ్రాండ్‌ను ప్రారంభించారు. 2022-23 నాటికి.. రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. సత్తా చాటారు. ముందుగా.. పలురకాల జుట్టు సమస్యలున్న మహిళతో మాట్లాడి వారికి కావలసిన ఉత్పత్తులు మన మర్కెట్లో లేవని నిర్ధారించుకున్నారు. అలాగే.. ప్రపంచంలో ది బెస్ట్ హెయిర్ ఎక్స్‌టెన్షన్లను ఎగుమతి చేస్తున్నదీ మనదేశమని గుర్తించారు.డిమాండ్‌కు తగిన తయారీ, సప్లై లేదని తెలుసుకుని.. 1 Hair Stop పేరుతో తమ స్టార్టప్ రెడీ చేసేశారు.
కలిసొచ్చిన నేస్తం..
రిచా తండ్రి.. సెలబ్రిటీలకు విగ్గులు, సవరాలందిచేవారు. తండ్రి సాయంతో ముందుగా లోకల్ ఆర్డర్లు తీసుకొన్న రిచా.. కజిన్ రైనా వచ్చాక విదేశాలకూ వ్యాపారాన్ని విస్తరించింది.
తొలినాళ్లలో ఇల్లే వీరి ఆఫీసు. రోజుకు 4 ఆర్డర్‌లే రాగా.. నేడు 150కి పైగానే వస్తున్నాయి. నాడు నెలకు రూ.10 వేలుగా ఉన్న వీరి మార్కెటింగ్ బడ్జెట్ నేడు రూ. 10-16 లక్షలు దాటింది. వీరి క్లయింట్లలో 25 శాతం విదేశాలవారు కాగా.. మిగిలిన వారు ఇక్కడివారే. హైదరాబాద్ జీడిమెట్లలో వీరి తయారీకేంద్రం ఉండగా, కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని ప్రారంభించనున్నారు.
అమ్మకాలు, ఉత్పత్తులు..
వీరికి నేటికి.. 1.2 లక్షలకుపైగా ఆర్డర్లు రాగా, 2.1 లక్షలకుపైగా ఉత్పత్తులనందించారు. 2022లోనే వీరికి 47వేల ఆర్డర్‌లుండగా, 90 వేల ఉత్పత్తులను అమ్మారు. మొత్తం ఆదాయం రూ.61 కోట్లు కాగా.. కేవలం నిరుటి వీరి ఆదాయం రూ.27 కోట్లు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్, బార్బీ కోర్ ఈస్తెటిక్‌లతో బాటు కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్లు వీరి పోర్టిఫోలియోలో ఉన్నాయి. సెలూన్లతో కలిసి వ్యాపారాన్ని మరింతగా పెంచే పనిలో వీరిద్దరూ బిజీగా ఉన్నారు.