
Jio Satellite Internet latest updates(India today news):
భారత్‌లో తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది. జియోస్పేస్‌ఫైబర్‌గా పిలుస్తున్న ఈ సర్వీస్‌ను భారత మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రిలయన్స్ జియో విజయవంతంగా ప్రదర్శించింది.
జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు ఫిక్స్‌డ్ లైన్, వైర్‌లెస్ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్ ను కూడా చేర్చినట్లు కంపెనీ తెలిపింది. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ 5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని వివరించింది.
ప్రపంచంలో తాజా ‘మీడియం ఎర్త్ ఆర్బిట్’ శాటిలైట్ టెక్నాలజీ కోసం జియో ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీని ద్వారా జియోకు ఎస్‌ఈఎస్‌కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.
భారత్‌లో లక్షలాది ఇళ్లు, వ్యాపారాలకు జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించామన్నారు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అనుసంధానతకు దూరంగా ఉన్న లక్షలాది మందికి కూడా జియోస్పేస్‌ఫైబర్ ద్వారా సేవలను విస్తరిస్తున్నామన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా కొత్త డిజిటల్ సమాజంలో చేరి గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చన్నారు ఆకాశ్ అంబానీ.
మరోవైపు.. టాటా గ్రూప్ మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్‌ను తయారు చేయనుంది. ఈ ఫోన్లను తయారు చేసే తొలి భారత కంపెనీగా టాటా సంస్థ అరుదైన ఘనత దక్కించుకుంది.
భారత్‌లో ఐఫోన్‌ల తయారీ టాటా గ్రూప్ చేతికొచ్చింది. మరో రెండున్నరేళ్లలో టాటాలు తయారు చేసే ఐఫోన్లను దేశ, విదేశాల్లో విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు. ఐఫోన్ల తయారీ కోసం తైవాన్ సంస్థ విస్ట్రాన్‌కు చెందిన కర్ణాటక ప్లాంట్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఐఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్ అవతరించింది.
పీఎల్ఐ ప్రోత్సాహక పథకంతో భారత్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతులకు నమ్మకమైన, ప్రధాన హబ్‌గా మారుతోందన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఇక.. రానున్న రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ కోసం టాటా గ్రూప్ భారత్‌లో ఐఫోన్ తయారీని ప్రారంభించనుంది. విస్ట్రాన్ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేసిన టాటా సంస్థకు అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం విస్ట్రాన్ కార్ప్ దేశీయంగా కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. విస్ట్రన్ కార్ప్‌తో ఏడాదిగా చర్చలు జరిపింది. తొలుత జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తర్వాత కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే జరిగిన విస్ట్రాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో.. టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించింది. కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో 100 శాతం వాటాలను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని విస్ట్రాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 125 మిలియన్ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.