
Paper Board Packaging : ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్యాకేజింగ్ పరిశ్రమకు ప్రాధాన్యం పెరిగింది. 2014లో ఈ-కామర్స్ మార్కెట్ విలువ ఒక్క మన దేశంలో 22 బిలియన్ డాలర్లు ఉండగా.. 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ లెక్కన పేపర్ బోర్డు ప్యాకేజింగ్ పరిశ్రమ కూడా విస్తృతం కావడం పక్కా.
ప్రపంచ వ్యాప్తంగా ప్యాకేజింగ్ మెటీరియల్‌గా పేపర్ బోర్డు వినియోగమే ఎక్కువగా ఉంది. ఇది దాదాపు 33.2 శాతం. కార్డ్ బోర్డు, ఫోల్డింగ్ బాక్స్‌బోర్డు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ది రెండో స్థానం. 25.5% వాటా ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్స్‌దే.
మెటల్ ప్యాకేజింగ్ మెటీరియల్ 12.1%, గ్లాస్ ప్యాకేజింగ్ మెటీరియల్ 5.8%, ఇతర ప్యాకేజింగ్ మెటీరియల్స్ 4.7% వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తగ్గించడంలో భాగంగా అమెజాన్ ఇండియా వినూత్న విధానాలను అనుసరిస్తోంది.
ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫిల్మ్ ప్యాకేజింగ్‌కు స్వస్తి పలికింది. ప్లాస్టిక్ ఎయిర్ పిల్లోస్, బబుల్ ర్యాపింగ్ స్థానంలో పేపర్, పేపర్ కుషన్స్‌ను ప్రవేశపెట్టింది. అంతే కాదు.. ప్యాకేజింగ్ కోసం రీసైక్లబుల్ పేపర్‌ను ఇక్కడే తయారు చేయాలని అమెజాన్ సంకల్పించింది. రీసైక్లబుల్ పేపర్ తయారీ మెషిన్లను ఇక్కడే కాదు.. జపాన్, ఆస్ట్రేలియాకూ విస్తరించే యోచనలో ఉంది.