
Adani Investigation:- హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీపై ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న అమెరికా పర్యటనలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అదానీపైనే ప్రశ్నించారు. కాని, దానికి సమాధానం చెప్పను అంటూ డైరెక్టుగానే రిప్లై ఇచ్చారు నిర్మలా సీతారామన్. ఇక దేశంలో రాహుల్ గాంధీ ఆల్రడీ అదానీ గ్రూప్ వ్యవహారాలు, అప్పుల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా శివసేన కూడా కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటూ క్వశ్చన్ చేశారు. అదానీ గ్రూప్‌పై 2021 నుంచి జరుపుతున్న విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియజేయాలని శివసేన ఎంపీ సెబీని కోరారు.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. 2021 నుంచి అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలపై విచారణ చేస్తోంది. ఆ ఎంక్వైరీ ఎంత వరకు వచ్చిందో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ చతుర్వేది. దీనిపై ఏప్రిల్ 18నే సెబీకి లెటర్ రాసినప్పటికీ.. ట్విటర్ వేదికగా ఇప్పుడు బయటపెట్టారు.
శివసేన ఎంపీ సెబీకి లేఖ రాసినప్పటికీ.. ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు. విచారణ జరుగుతోందా, ఇంకా ఆలస్యం అవుతుందా.. ఒకవేళ ఆలస్యం అవుతుంటే.. జాప్యానికి కారణాలేంటి అనే వివరాలు కూడా సెబీ ఇవ్వడం లేదని ఆరోపించారు. అదానీ విషయంలో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. షేర్ ప్రైస్ పెంచేందుకు కంపెనీ అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.
అదానీ గ్రూప్‌పై వచ్చే ప్రతి న్యూస్‌ను ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒకప్పుడు భారీగా లాభాలు ఇచ్చిన ఈ గ్రూప్ షేర్లు.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ తరువాత చాలా దారుణంగా పతనం అయ్యాయి. ఇప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు అదానీ జోలికి రావడం లేదు. రిస్క్ తీసుకుంటున్న కొందరు మాత్రమే ట్రేడ్ చేస్తున్నారు. దీంతో అదానీ గ్రూప్‌పై ఏ వార్త వచ్చినా ఆసక్తిగా గమనిస్తున్నారు.