
Prerna Jhunjhunwala : ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు స్టార్టప్‌ల వైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ప్రేరణ.. కూడా ఈదారినే ఎంచుకుంది. స్కూల్ నిర్వాహకురాలిగా ఉన్న ప్రేరణ.. యాప్ అండతో నేడు పలుదేశాల చిన్నారులకు ఆటపాటలతో కూడిన పాఠాలు చెబుతూ కోట్లు ఆర్జిస్తోంది. మరి.. ప్రేరణ ప్రయాణం ఎలా సాగిందో మనం తెలుసుకుందాం.
3 నుంచి 8 ఏళ్ల లోపు చిన్నారులకు రొటీన్ పద్ధతిలో గాక.. వాళ్లకు ఇష్టమైన పద్ధతిలో పాఠాలు చెబితే ఎలా ఉంటుందనేది ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా ఆలోచన. న్యూయార్క్ వర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ పొందిన ప్రేరణ.. సింగపూర్‌లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్‌టన్ అనే ప్రీ స్కూల్ పెట్టారు. ఆటపాటలతో పిల్లలకు చదువు చెప్పటం ఈ బడి ప్రత్యేకత. ఈ కాన్సెప్ట్‌ను ‘గెలీలియో’ అనే తన యాప్ సాయంతో విదేశీ చిన్నారులకూ బోధిస్తున్నారు.
ఈ యాప్‌లో ఛోటాభీమ్, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బాస్ లాంటి పాత్రలు పిల్లలకు పాఠాలు చెబుతాయి. ఈ యాప్‌లో వీడియోలు, పాటలు, గేమ్స్, పిల్లల వయసుకు తగ్గ పాఠాలుంటాయి.
కొవిడ్ వేళ ఈ యాప్ బాగా జనంలోకి వెళ్లగా.. కేవలం భారత్, పొరుగుదేశాల్లోనే కోటిమంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. తమకు నచ్చిన పాత్రలు చెప్పే పాఠాన్ని వినటంతో పిల్లలు చదువులో రాణిస్తున్నారనేది ప్రేరణ మాట. యాప్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు 2022లో ప్రేరణ.. సుమారు రూ.60 కోట్ల నిధులు సమీకరించారు.నేడు గెలీలియో రూ.330 కోట్లు విలువ గల యాప్‌గా నిలిచింది.
60 సిబ్బందితో పనిచేసే ఈ యాప్.. కార్యకలాపాలను త్వరలో ఇండోనేసియా, వియత్నాంలకూ ప్రేరణ విస్తరించనున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో మొత్తం 7 పాఠశాలలను నిర్వహిస్తోన్న ప్రేరణ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఆన్‌లైన్‌లోనూ పాఠాలు చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.