
Apple: యాపిల్ ఉత్పత్తులను భారతీయులకు మరింత చేరువ చేయాలి.. ఇదే మోటోతో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ దేశంలో అడుగుపెట్టాడు. బిజినెస్ ను మరింతగా విస్తరించే ఆలోచనల్లో భాగంగానే కుక్ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగాడు. ఇన్నాళ్లూ ఆన్ లైన్ మోడ్ లో జరిగిన అమ్మకాలు.. ఇకపై ఆఫ్ లైన్ లో జరిగేలా స్టోర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్న భారత్ నుంచి టిమ్ కుక్ ఏం ఆశిస్తున్నారు?
బిజినెస్ ఎక్స్‌ప్యాన్షన్.. ఓ వ్యాపారి మైండ్‌లో ఎప్పుడు తిరిగే ఆలోచనిదే! ఇందుకు వేల కోట్లు ఉన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా అతీతుడేం కాదు. భారత్ ప్రపంచమార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌లో ఒకటిగా ఉంది. అందుకే వరల్డ్‌వైడ్‌గా గుర్తింపుపొందిన కంపెనీలన్నీ కూడా తమ వ్యాపారాన్ని భారత్ కు విస్తరింపజేస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూగా భారత్ పై ఫోకస్ పెట్టని యాపిల్ సీఈవో టిమ్ కుక్.. సడెన్ గా ఇండియన్ మార్కెట్ పై గురిపెట్టడం వెనక ఉన్న ఆంతర్యమేంటీ..? భారతీయులకు ఉపాధి కల్పించడమే టిమ్ కుక్ ఉద్దేశమా? అంటే కచ్చితంగా కాదు.. ఇదంతా కూడా బిజినెస్ ట్రిక్స్. భారతీయులకు యాపిల్ ఉత్పత్తుల గొప్పతనం చూపించి.. వాటిని ఖరీదు చేసేలా చేయడమే టిమ్ కుక్ ఇండియా ట్రిప్ అసలు ఉద్దేశం.
దేశంలో యాపిల్ ఉత్పత్తుల విస్తరణపై ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న టిమ్ కుక్.. ఇప్పుడెందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.. అందుకు కారణం ఇటీవల భారత్ లో యాపిల్ ప్రొడక్ట్స్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. టిమ్ కుక్ చేయించిన సర్వే, ఇతర నివేదికలు చెబుతున్నది ఇదే. అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. భారత్ ను ప్రస్తుతం బంగారు గుడ్డు పెట్టే బాతుగా చూస్తున్నాడు. తన పర్యటనను హైలెట్ చేసి యాపిల్ ఉత్పత్తులకు భారత్ లో ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చేలా చేస్తున్నాడు. అందులోభాగంగానే మాధురి దీక్షిత్ తో ముంబైలో వడపావ్ తినడం.. పుల్లెల గోపిచంద్ అకాడమీలో షట్లర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం లాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా టిమ్ కుక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యాడు. ఇప్పటికే చెన్నైలో ఫాక్స్‌కాన్ తో కలిసి యాపిల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అయితే ముడిసరుకు మాత్రం మొత్తం చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఫోన్ అసెంబ్లీంగ్ కు అవసరమయ్యే ఉత్పత్తులను కూడా భారత్ లోనే తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేస్తామని మోదీతో టిమ్ కుక్ చెప్పినట్టు సమాచారం. ఒక వేళ ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటయితే పెద్దెత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ స్టోర్లను రిటైల్ అమ్మకాల కోసం ఏర్పాటుచేశామని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం యాపిల్ ప్రొడక్ట్ లను మరింతగా మార్కెటింగ్ చేసేందుకేనని తెలుస్తోంది.
2020 తర్వాత భారత్ లో యాపిల్ ఫోన్ల అమ్మకాలు భారీగానే పెరిగాయి. 2020ముందుతో పోల్చితే 2శాతం పెరుగుదల నమోదైంది. అటు ఈ సంవత్సరం చివరినాటికి 6శాతం అధిక వృద్ధిరేటు నమోదు చేయాలని టిమ్ కుక్ భావిస్తున్నారట. పోయిన నెల వరకు ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారానే 60శాతం యాపిల్ ప్రొడక్ట అమ్మకాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఇండియన్ మార్కెట్ పై కుక్ కన్నేశాడని బిజినెస్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
భారత్ లో తయారైన ఐఫోన్ల ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి యాపిల్ రెవెన్యూ కూడా 2022తో పోల్చితే 50శాతం పెరిగింది. ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్.. భారత్ లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగానే తొలిదశలో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించాడు. ఈ సందర్భంగా భారత్‌ను అతిపెద్ద మార్కెట్ గా అభివర్ణించారు. భవిష్యత్ లోనూ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామన్నారు. సో మొత్తంగా యాపిల్ ఉత్పత్తులను జనాలకు మరింత దగ్గరగా చేసి.. అమ్మకాలు పెంచుకోవాలన్నదే కుక్ ప్లాన్. అయితే బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకునే భారతీయులు.. చౌకగా లభించే ఇతర కంపెనీ ఫోన్లను కాదని.. యాపిల్ ను ఇంకెంత మేరకు ఆదరిస్తారో? 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా ఎదిగిన ఇండియాను.. 100 కోట్ల కస్టమర్లు ఉన్న దేశంగా చూస్తోంది యాపిల్. అందుకే, ఈ స్పెషల్ ఇంట్రెస్ట్.