
Russian Crude Oil :ముడి చమురుపై రష్యా స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది. మిగతా దేశాల కంటే తక్కువ ధరకు భారత్‌కు క్రూడాయిల్ ఎగుమతి చేస్తోంది. భారత్ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటోంది. కేవలం దేశీయ అవసరాలకే కాకుండా.. ఇక్కడ శుద్ధి చేసి తిరిగి యూరప్ దేశాలకు అమ్ముకోవడం వల్ల కూడా బాగానే ఆర్జిస్తోంది ఇండియా. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు.. రిలయన్స్, నయారా కంపెనీలకు కూడా భారీగానే లాభాలు వస్తున్నట్టు తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్.. రోజుకు 36 వేల బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు 60 డాలర్ల కంటే తక్కువకే ముడిచమురు వస్తుండడంతో… రోజుకు సగటున 9 లక్షల 10వేల బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోంది భారత్. అంటే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒకేసారి 2400 శాతం పెరిగాయన్న మాట.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతులు బ్యాన్ చేశాయి యూరప్ దేశాలు. ఇప్పుడు ఆ యూరప్ దేశాలకు ఆయిల్ సప్లై చేస్తున్నది భారతే. రష్యా నుంచి తక్కువకు ముడి చమురు కొని.. వాటిని శుద్ధి చేసి, తిరిగి యూరప్ దేశాలకు అమ్ముతోంది. ఇలా పశ్చిమ దేశాలకు చమురు ఉత్పత్తులు ఎగుమతి చేస్తుండడంతో ఈ ఎక్స్‌పోర్ట్స్ 22 శాతం పెరిగాయి.
అంతా బాగానే ఉంది గానీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారన్న దానిపై మాత్రం కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేటుతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ రేటుకే కొంటోంది ఇండియా. ఇప్పటికి దాదాపు ఏడాది నుంచి ఇలా తక్కువ ధరకే కొంటోంది. అందులోనూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయి. ఈ లెక్కన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాల నుంచి బయటపడే ఉంటాయన్నది నిపుణుల మాట. అలాంటప్పుడు.. ఇకనైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.