
Sudha Murty : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి భార్యగా సుధామూర్తి అందరికీ పరిచితులే. ఆమె సుధా మూర్తి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ .. తర్వాత 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అప్పట్లో గ్రాడ్యుయేషన్‌లో మంచి మార్కులు సాధించిన కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు. MTech, BE చదివే రోజుల్లో వారి బ్యాచ్‌లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సుధ మాత్రమే. మిగతా అంతా అబ్బాయిలే.
1974లో సుధామూర్తి ఎంటెక్ పూర్తయ్యే సమయానికి అమెరికాలో చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికోసం స్కాలర్‌షిప్ కూడా మంజూరైంది. అదే సమయంలో టాటా గ్రూప్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టెల్కో (నేడు టాటా మోటార్స్)కు సంబంధించిన ఓ ఉద్యోగ ప్రకటన అప్పటి ప్రధాన పత్రికల్లో యాడ్ రూపంలో వచ్చింది. దాన్ని చూసి.. ‘ ఓ… ఇంకేం. వీళ్లకి కావాల్సిన అన్ని అర్హతలూ నాకున్నాయి. ట్రై చేస్తే పోలా’ అనుకునే లోగా యాడ్ కింద చిన్న అక్షరాల్లో ‘ఈ ఉద్యోగం కేవలం మగవారికి మాత్రమే’ అని రాసుంది.
అది చూసి ఆమె ఒళ్లు మండిపోయింది. వెంటనే ఓ పోస్ట్‌కార్డ్ తీసుకుని ‘ అబ్బే.. మీ కంపెనీ పద్ధతేం బాలేదు. ఈ రోజుల్లోనూ ఇంకా లింగ వివక్షా? అందులో మీలాంటి చదువుకున్న మనుషులు నడిపే కంపెనీలోనూ ఇదే పద్ధతా? ఇలా అయితే.. మీరు వెనకబడిపోతారు. నిజంగా మీరు అవకాశం ఇచ్చి చూడండి. పురుషుల కంటే మహిళలే బాగా రాణిస్తారు. మహిళలనే వంకపెట్టి మీరు అసలు అవకాశమే ఇవ్వకపోతే.. జనాభాలో సగమున్న మహిళల ప్రతిభ ఎలా బయటికొస్తుంది సార్..’ అని రాసి.. అడ్రస్ దగ్గరకు వచ్చే సరికి ఎవరి పేరు రాయలో అర్థం కాక.. ఏదైతే అదయందని ఏకంగా టాటా గ్రూప్ ఛైర్మన్.. జేఆర్డీ టాటా అడ్రస్ రాసి పోస్టు చేసింది. ఇదేం బాలేదు. రాశారు. అయితే ఆ పోస్ట్‌కార్డ్‌ని ఎవరికి పంపాలో తెలియక నేరుగా జేఆర్‌డీ టాటాకు అందేలా పోస్ట్ చేశారు సుధా మూర్తి.
సుధా మూర్తి లెటర్ చూసిన JRD టాటా వెంటనే ఆ అమ్మాయి తెగువ తెగ నచ్చేసింది. ఆమెను ఇంటర్వ్యూకి రమ్మని పిలుపుతో బాటు నాటి నుంచి టాటా గ్రూప్ ఉద్యోగాల్లో మహిళలకూ వాటా ఇవ్వటం మొదలైంది. అంతేకాదు.. మొత్తం టాటా గ్రూపులోని అన్ని వ్యాపారాల రిక్రూట్‌మెంట్ పాలసీని తిరగరాసేలా చేసింది.
సీన్ కట్ చేస్తే.. అమెరికా వెళ్లాల్సిన సుధామూర్తికి టెల్కోలో ఇంజనీర్‌గా చేరింది. టాటా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం పొందిన తొలి మహిళా ఇంజనీర్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. మరెంతమందో అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవటానికి ప్రేరణ అయ్యింది. దటీజ్ సుధామూర్తి…