
Oil Supply: ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి దరిమిలా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పోరు కారణంగా ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు ఏకంగా 5శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు సరఫరాలో మూడోవంతు వాటా పశ్చిమాసియా దేశాలదే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి.
ఇప్పటికే క్రూడాయిల్ ధరలు భారీ స్థాయికి చేరాయి. మొన్నటి దాకా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా వంద డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అగ్నికి ఆజ్యం తోడైనట్టు.. ఇప్పటికే కొండెక్కిన చమురు ధరలు ఇజ్రాయెల్-హమస్ పోరుతో మరింత పెరిగే ప్రమాదం కనపడుతోంది. ఇప్పటికే దాని ప్రభావం కనిపిస్తోంది.
తాజా పోరులో ఇప్పటివరకు ఇరువైపులా 1100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. అంతిమంగా ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందన్న విషయం బహిర్గతమైనందున.. పరిస్థితి ఎటు దారి తీస్తుందోననేది ఊహాతీతంగా ఉంది.
అరబ్ లీగ్ దేశాలైన ఈజిప్టు, యూఏఈ, బహ్రెయిన్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ఇజ్రాయెల్.. సౌదీ అరేబియాకు కూడా దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఆ దేశాల మధ్య 2024లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో.. హమాస్ మెరుపు దాడికి దిగింది. ఆ ఒప్పందానికి గండికొట్టాలన్న యోచనతోనే ఇరాన్ దేశం హమాస్‌తో వ్యూహాత్మకంగా ఈ దాడులు చేయించిందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ఇరాన్‌పై కన్నెర్ర చేస్తే మాత్రం చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితం కావడం తథ్యం. చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ బెదిరింపులకు దిగితే పరిస్థితి ఏమిటనే ఆందోళనను చమురు రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ సారి ఇలాంటి బెదిరింపులకే ఇరాన్ దిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. నిత్యం ఈ జలసంధి ద్వారా 17 బిలియన్ బారెళ్ల మేర చమురు సరఫరా జరుగుతుంటుంది.
తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 4.02 శాతం పెరిగి 87.98 డాలర్లకు చేరుకోగా.. డబ్ల్యూటీఐ బ్యారెల్‌కు 4.26 శాతం పెరిగి 86.32 డాలర్లకు చేరుకుంది. గత మూడు నెలల్లో చమురు ధరలు ఏకంగా 30 శాతం పెరిగాయి. ముడి చమురు ధర గత 13 నెలల రికార్డు గరిష్ఠానికి చేరుకుంది.