
Co-parent in Laws Elope : ఒక మహిళ తన కొడుకు మామగారిని(Father in Law) ప్రేమించింది. సమాజం తమ ప్రేమను అంగీకరించదని తెలిసి వారిద్దరూ పారిపోయారు. ఆ తరువాత వారి కుటుంబాలలో గొడవలు మొదలయ్యాయి. ఈ విషయం తెలిసిన ఆ ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌కు చెందిన ఆశారాణి(41) అనే మహిళ కుటుంబంలో ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరోవైపు అదే ఊరికి చెందిన రామ్‌నివాస్ రాథోడ్(44)కు ఒక కుమార్తె ఉంది. అతని భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది.
ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం రామ్‌నివాస్ రాథోడ్ ఒక కుమార్తెకు, ఆశారాణి కుమారుడికి వివాహం జరిగింది. అప్పటి నుంచి రామ్‌నివాస్ రాథోడ్ తన కూతురి అత్తగారింటికి తరుచూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో మధ్యవయస్కులైన రామ్‌నివాస్, ఆశారాణిల మధ్య ప్రేమ చిగురించింది.
ఆ తరువాత వారిద్దరూ ఒకరోజు ఇంటి నుంచి పారిపోయారు. తన భార్య కనపడడం లేదంటూ ఆశారాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా.. రామ్‌నివాస్ రాథోడ్‌పై అనుమానం కలిగింది. అతని ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి వారిద్దరినీ పట్టుకున్నారు. కానీ వారిద్దరూ మేజర్లు కావడం.. పైగా ఆశారాణి కూడా అతడిని ప్రేమిస్తోందని తెలిసి పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.
దీంతో రామ్‌నివాస్ రాథోడ్, ఆశారాణి తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వస్తున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.