
Email ID Fraud : ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాలు చేసే సైబర్ దుండగులు.. దొంగతనాలు చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఇటీవలే కొందరు దొంగలు ఓ బ్యాంక్ అధికారిని కేవలం ఒక ‘ఈ మెయిల్ ఐడీ’తో (Email ID Fraud)తో బురిడీ కొట్టించారు. ఆ ‘ఈ మెయిల్ ఐడీ’ తో ఒక మెసేజ్ చేసి బ్యాంక్ నుంచి రూ.18 లక్షలు కాజేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన యోగేశ్ శర్మ(27), ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ గుప్తా(26) అనే ఇద్దరు యువకులు ఒక బంగారు నగల షాపుకు చెందిన ‘ఈ మెయిల్ ఐడీ’ని పోలిఉన్న కొత్త ‘ఈ మెయిల్ ఐడీ’ని సృష్టించారు. ఆ తరువాత ఆ బంగారు నగల షాపు యజమాని తనేనేంటూ యోగేశ్ శర్మ.. ముంబై కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాడు. తనకు వెంటనే బ్యాంకు ఖాతా నుంచి రూ.18 లక్షలు కావాలని యోగేశ్ మేనేజర్‌ని కోరాడు. అందుకు ఆ మేనేజర్ బంగారు నగల షాపుకు సంబంధించిన ‘ఈ మెయిల్ ఐడీ’తో మెసేజ్ చేయమన్నాడు.
ఆ తరువాత యోగేశ్ ఒక ఫోన్ చేయడంతో ఉమేశ్ గుప్తా ఆ ‘ఈ మెయిల్ ఐడీ’తో మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్‌లో వచ్చిన మనిషి సంస్థ యజమాని అని ఆయనకు రూ.18లక్షలు బ్యాంకు నుంచి వేర్వేరు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఉంది. అది చూసిన బ్యాంక్ అధికారి యోగేశ్ చెప్పిన ఇతర బ్యాంకు ఖాతాలకు రూ.18 లక్షలు బదిలీ చేశాడు. పని పూర్తైన వెంటనే యోగేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొన్ని గంటల తరువాత బంగారు నగల షాపు అసలు యజమాని బ్యాంకు వచ్చాడు. తమ ఖాతా నుంచి రూ.18 లక్షలు ఎవరు తీశారని బ్యాంక్ అధికారులను ప్రశ్నించాడు. అప్పుడు వారు ‘ఈ మెయిల్ ఐడీ’ ద్వారా వచ్చిన మెసేజ్‌ని చూపించారు. కానీ అది నకిలీ ‘ఈ మెయిల్ ఐడీ’ అని ఆ షాపు యజమాని ధృవీకరించాడు. ఆ నకిలీ ‘ఈ మెయిల్ ఐడీ’లో కొన్ని అక్షరాల తేడా ఉంది. ఈ ఘటన తరువాత బ్యాంక్ అధికారులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ పోలీసులు విచారణ మొదలు పెట్టి రూ.18 లక్షలు ఏయే ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారో వాటిని ట్రాక్ చేశారు. ఆ ఖాతాదారులంతా కూలీ చేసుకునే వాళ్లని.. వారితో ఆదర్శ్ సింగ్ అనే వ్యక్తి కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచాడని తెలిసింది. పోలీసులు ఆదర్శ్ సింగ్‌ను అరెస్టు చేశారు. అతడని గట్టిగా ప్రశ్నించే సరికి అసలు దొంగలు యోగేశ్ శర్మ, ఉమేశ్ గుప్తా అని తెలిసింది. వారికి సహాయం చేసినందుకు ఆదర్శ్ సింగ్‌కి 10 శాతం కమీషన్ లభించింది.
ఆదర్శ్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం విచారణ చేసిన సైబర్ పోలీసులు.. యోగేశ్ శర్మ, ఉమేశ్ గుప్తాను అరెస్టు చేశారు.