
Father in Law : నలుగురు పిల్లలకు తండ్రి అయిన ఓ వ్యక్తి దాపరికంగా రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగు నెలల తరువాత ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో.. ఆమె తన మామగారికి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయమని ఏడ్చింది. కానీ ఆ పెద్దమనిషి.. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా నగరంలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా నగరానికి చెందిన దాద్రీ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తికి తొమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి ముగ్గరు కూతర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయినా అతను మొదటి భార్య ఉండగా.. నాలుగు నెలల క్రితం మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం కొద్ది రోజుల క్రితమే అతని మొదటి భార్యకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతను మొదటి భార్యను విపరీతంగా కొట్టి.. ఇక ఎప్పుడూ రెండో భార్య వద్దనే ఉంటానని వెళ్లిపోయాడు.
ఆ మొదటి భార్య తనకు భర్త అన్యాయం చేశాడంటూ.. మామగారికి(భర్త తండ్రి) ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయమని ప్రాధేయపడింది. ఇక తన పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారని ఏడ్చింది. ఆ సమయంలో ఆమెను ఓదార్చిల్సిన పెద్దమనిషి.. ఆమెను లొంగదీసుకున్నాడు. కోడలు అని కూడా చూడకుండా ఆమెను కొట్టి అత్యాచారం చేశాడు.
ఆ తరువాత బాధితురాలు తన భర్త, మామగారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదు నమోదుచేయలేదు. అయినా అధైర్యపడక ఆమె కోర్టులో కేసు పెట్టింది. కేసు విచారణ మొదలు పెట్టిన కోర్టు పోలీసులను వెంటనే ఆమె ఫిర్యాదు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.