
Road Accident : కర్ణాటక రహదారులు నెత్తురోడాయి. గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 12 మంది వలస కూలీలు మరణించారు. చిక్ బళ్లాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చిక్ బళ్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. మృతులు, క్షతగాత్రులంతా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం 44వ జాతీయ రహదారిపై చిక్ బళ్లాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగింది. దసరా పండుగకు సొంత ఊరికి వెళ్లిన వారంతా.. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్రకు బయల్దేరారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో.. టాటా సుమో డ్రైవర్ నరసింహులుకు మార్గం కనిపించక ఆగిఉన్న ట్యాంకర్ ను ఢీ కొట్టాడు. సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. “కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం.” అని ట్వీట్ చేశారు.