
Temple Built by Ghosts : హీరోలు, హీరోయిన్లు దెయ్యం నుంచి తప్పించుకుని దేవాలయాల్లోకి వెళ్లడం. అప్పుడు ఆ దెయ్యాలకు దేవాలయాల్లోకి ఎంట్రీ ఉండదు. ఇలాంటివి చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అలాంటిది ఓ గుడిని దెయ్యాలు నిర్మించాయంటే నమ్మగలరా? అది కూడా ఒక్క రాత్రికే గుడిని కట్టేశాయి. మరి ఆ గుడి ఎక్కడ ఉంది? దాని వెనుకున్న కథేంటో తెలుసుకుందామా!
దెయ్యాలు కట్టిన గుడిని చూడాలంటే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలో ఉన్న బొమ్మవర అనే గ్రామానికి వెళ్లాల్సిందే. ఆ గ్రామంలో.. ‘సుందరేశ్వరాలయం’ అనే శివుడి గుడి ఉంది. ఈ గుడి చూసేందుకు సాధారణ ఆలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. దానికి కారణం.. మామూలు ఆలయాలపై దేవుడి బొమ్మలు, నృత్య భంగిమలు ఉంటే.. ఈ గుడిపై మాత్రం దెయ్యాల బొమ్మలు ఉంటాయి. ఆలయం వైపు చూడగానే ఆ దెయ్యాలే దర్శనమిస్తుంటాయి.
రాత్రికి రాత్రే ఆలయ నిర్మాణం..
వందేళ్ల క్రితం.. బొమ్మవర గ్రామాన్ని దెయ్యాలు భయపెట్టేవట. దీంతో స్థానికులు ఓ శివాలయాన్ని నిర్మించారు. అయితే, దెయ్యాలు ఆ గుడిని నాశనం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఓ మాంత్రికుడు దెయ్యాలను బంధించగా.. విడిచిపెట్టమని దెయ్యాలు వేడుకున్నాయట. పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి, ఊరిని వదిలి వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడు. దీంతో ఇక తప్పదని దెయ్యాలు రాత్రికి రాత్రే శివలింగం లేని గుడిని నిర్మించి, అక్కడి నుంచి మాయమైపోయాయని పురాణాలు చెబుతున్నాయి.