
Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు బ్రహ్మోత్సవాల సమయంలో వేంకటేశ్వర స్వామివారికి హుండీ ద్వారా రూ.47.56 కోట్ల ఆదాయం సమకూరింది.
అధిక మాసం వచ్చిన ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి మూడేళ్లకు ఒకసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శ్రావణమాసం అధికమాసం రావడంతో.. శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. తిరుమలలో మొదటి బ్రహ్మోత్సవాలు(సాలకట్ల బ్రహ్మోత్సవాలు) సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 26 వరకు జరిగాయి. రెండో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో 11 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 33.78 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించామని పేర్కొన్నారు. ఈ సమయంలో 57.64 లక్షలకుపైగా లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. 4.29 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయన్నారు. టీటీడీ అధికారులు, 23 వేల మందికిపైగా సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కృషి చేశారని కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని స్పష్టం చేశారు.
BRS MLA : లాయర్ పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి.. బాధితుడికి రేవంత్ పరామర్శ..