
Trimurti Temple: లింగ రూపంలో శివుడు, విష్ణుభగవానుడు, బ్రహ్మ ఈ ముగ్గురు ఒకే చోట దర్శనం ఇచ్చే ఆలయం నిజామాబాద్ జిల్లాలో ఉంది. అదే 15 వ శతాబ్దాం నాటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం. జైన, ఆర్య సంస్కృతుల సమ్మేళనంతో ఆలయాన్ని నిర్మించారు . మొదటి జైన మత ఆలయం కూడా ఇదేనంటారు. త్రిమూర్తులు ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని మొదట శివునికి అంకితం చేశారు. అందుకే నీలకంఠేశ్వర ఆలయంగానే పరిగణిస్తారు. ఎత్తైన గోపురం, మండపం, విమానం కలిగిన ఆలయంలో చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయం మతపరమైన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది.ఎన్నో ఇతిహాసాలు, పురాణాలతో ఈ ఆలయ చరిత్ర ముడిపడి ఉంది. ఒక పురాణ కథ ప్రకారం పక్షి రూపంలో శివుడు ఒక భక్తుడికి కనిపించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించారుట. ప్రచారంలో ఉన్న మరొక పురాణం ప్రకారం, శివుడు తాండవం చేసిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించారట. పూరీ జగన్నాథ ఆలయ శిఖరాన్ని తలపించే విధంగా ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయ సముదాయం చుట్టూ ఉన్న పెద్ద గోడ ఎన్నో అందమైన శిల్పాలతో తీర్చిదిద్దారు. భారీ గోపురం ద్వారా భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుంది.
ఈ ఆలయంలో స్వామికి వైద్యం చేసే శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహిస్తే బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. కోర్టు కేసులతో ఇబ్బందులు పడేవారు స్వామిని దర్శిస్తే ఉపశమనం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు. ఉత్తరాన ఉండే పుష్కరిణిలో స్నానం ఆచరించి భక్తుల స్వామిని దర్శించుకుంటారు. మాఘ శుద్ధ రధ సప్తమి రోజు జరిగే రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శివ, పరమేశ్వరులు ఉత్తవ మూర్తులుగా రథాన్ని భక్తులే స్వయంగా లాగుతారు. మహాశివరాత్రి సమయంలను, కార్తీకమాసంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.