
Shiva : మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ, కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు. నిరాకారుడికి చిహ్నమే శివలింగం.మనం దర్శిస్తున్న శివలింగం స్త్రీ, పురుషుల సృష్టి సంకేతం. లింగం పురుష స్వరూపం, లింగం కింద ఉండే పానువట్టం స్త్రీ స్వరూపం. సృష్టి స్వరూపమే శివలింగం. నామము , రూపము లేని వాడు దేవుడు. శివాలయాల్లో ఎక్కడా శివుని ప్రతిమలు కనిపించవు. శివాలయాలు ఎక్కడ ఉన్నా శాంతి నిలయాలుగా ఉంటాయి. శివుడికి మడి, మైల, అగ్రజాతి, అధోజాతి, అన్న తారతమ్యాలు లేవు. ఏ శివాలయంలోనైనా శివలింగాన్ని మన చేతులతో స్పృశించి శివ శక్తిని పొందవచ్చు. శివోహం అనుకోవచ్చు. భృగుమహర్షి శాపం వల్ల శివుడు లింగరూపంగానే పూజించబడుతున్నాడు.
శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోకవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురై శివుడిని శపిస్తాడు.శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుందని శపించడం వల్ల శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైంది. అంతకుముందు శివుడు విగ్రహ రూపంలోనే పూజలు అందుకునేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ శాపం వల్ల శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించే సంప్రదాయం మొదలైంది.
జననమరణాలకు అతీతుడైన శివుడిని దేవతలు కూడా పూజిస్తారు. శివుని దేహంపైన ఉన్న సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. అభిషేక ప్రియుడు అయిన శివుడిని భక్తులు కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. భారతదేశంలోని దేవాలయాలలో శివుని ఆలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయంటే శివుని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
లయకారకుడైనా శివుడు స్థిరస్వరూపుడు. స్థితికారకుడైన విష్ణువు బహురూపుడు. జంబూద్వీప భరత ఖండంలో శైవమే పురాతనమన్న వాదన కూడా ఒకటి ఉంది. 1920 నాటి మొహంజదారో, హరప్పా తవ్వకాల్లో కొన్ని శివలింగాలు దొరికాయి. భారత దేశానికి ఆర్యులు రాక ముందు అంటే క్రీస్తు పూర్వం 3000-1750 నాటి మొహంజదారో నాగరికతనే సింధూ నాగరికతగా అంటున్నాం. ఈ మొహంజదారో ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది. ఆర్యులు క్రీస్తు పూర్వం 1600 సంవత్సరాలప్పుడు భారతదేశానికి మధ్య ఆసియా నుంచి వచ్చారని చరిత్రకారులు చెబున్నారు.