
Chinese Chopsticks : ప్రపంచ జనాభాలో చైనాది రెండవ స్థానం. పొలాలు, అడవులు, లోయలు, జలపాతాలతో కూడిన ఒకనాటి చైనా నేటి ప్రపంచీకరణ తర్వాత పర్యావరణం పరంగా ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటోంది. చైనాలోని అడవులు వేగంగా అంతరించి పోతున్నాయనీ, దీనివల్ల లక్షల రకాల జీవజాతులూ ఉనికిని కోల్పోతున్నాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీనికి అక్కడి ఆహారం తీసుకునే పద్ధతీ ఒక ప్రధాన కారణమేనని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
చైనీయులు ఏ ఆహారాన్నైనా.. చాప్‌స్టిక్స్‌తోనే తింటారు. చైనా భాషలో ‘చాప్ చాప్’ అంటే చైనాలో ‘తొందరగా’ అని అర్థం. చాప్ చాప్ అనే పదమే కాలగమనంలో బ్రిటిషర్ల ప్రభావంతో చాప్‌స్టిక్స్ అయింది. షాంగ్ రాజవంశీయుల కాలం (1766 – 1122) నుంచే ఇవి వాడుకలో ఉన్నట్లుగా చెబుతారు.
చైనాతో బాటు దక్షిణాసియా దేశాల్లోని జపాన్, ఉభయ కొరియాలు, వియత్నాంలలోనూ అనాదిగా చాప్‌స్టిక్స్ వినియోగం ఉంది. చైనా నుంచే ఈ సంస్కృతి మిగతా దేశాలకు పాకింది. భారత్ పక్క దేశాలైన నేపాల్, భూటాన్, టిబెట్‌లోనూ కొందరు చాప్‌స్టిక్స్‌ని వాడతారు.
చైనా ప్రాచీన సంప్రదాయం ప్రకారం వీటిని కుడి చేతితోనే వాడాలి. అయితే ఆ సంప్రదాయం కనుమరుగై ఎడమ, కుడిచేతులతో ఎడాపెడా వాడేస్తున్నారు. చైనా స్టిక్స్‌కి ఇతరదేశాల్లో వాడే చాప్‌స్టిక్స్‌కి చాలా తేడా ఉంది. చాప్‌స్టిక్స్‌ని వాడాలంటే అనుభవం, నేర్పు, ఓర్పు కావాలి.
చాప్‌స్టిక్స్‌ని గడ్డి జాతికి చెందిన వృక్షాల నుండి చేస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్, మెటల్, ఎముకలు, దంతాలతోనూ తయారు చేస్తున్నారు. అయితే.. వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో వారు ఎలాంటి మార్పూ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల చైనాలో రోజుకి వంద ఎకరాల పరిధిలోని చెట్లు నశిస్తున్నాయని ఒక అంచనా.
చైనా జనాభా 140 కోట్లు కాగా.. వారిలో 100 కోట్ల మంది ఏడాది వ్యవధిలో 4500 కోట్ల చాప్‌స్ట్టిక్స్‌ని వాడి పారేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఒక రోజులో 13 కోట్ల చాప్‌స్ట్టిక్స్‌ని వృథా చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి 1.6 నుంచి 2.5 వృక్షాలను తిరిగి పెంచాల్సి ఉంది.
కానీ.. అడవులనాశనం, భూసారం క్షీణించడం, వరదలు, కాలుష్యం, జీవవైవిధ్యం లేకపోవటంతో అడవుల పెంపకం అటకెక్కిపోయింది. ఈ ఘోరకలిని నివారించేందుకు 2006లో చైనాలోని పర్యావరణ ప్రేమికులు మీ చాప్‌స్టిక్స్‌ని మీరే తయారుచేసుకోండి అనే నినాదాన్ని ఇచ్చారు.
నిజానికి.. చాప్‌స్టిక్స్ తయారీ, మార్కెటింగ్ మీద చైనాలో లక్షలమంది ఆధారపడ్డారు.300కు పైగా పరిశ్రమలు వీటిని తయారు చేస్తున్నాయి. చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ నిరుడు చాప్‌స్టిక్స్ తయారీ కంపెనీలన్నింటితో ముఖాముఖి చర్చలు జరిపింది. ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో అటవీ సంపద నాశనమవు తున్నదని, వీలున్నంత త్వరగా ఈ పనికి స్వస్తి చెప్పి వేరు పని చూసుకోవాలని ఆదేశించింది కూడా.
అయితే.. వారంతా దీనిపై ఆందోళనకు దిగారు. ముందుగా తమకు వేరే ఉపాధి చూపి.. తర్వాత తమ యూనిట్ల మూసివేతకు ప్రభుత్వం సిద్ధపడాలని వారు కోరుతున్నారు. అయితే.. ఇంతమందికి కొలువులు మావల్ల కాదంటూ సర్కారు చేతులెత్తేసింది.
అటు.. దేశంలోని కొన్ని పెద్ద రెస్టారెంట్లు వాడేసిన చాప్‌స్ట్టిక్స్‌ని స్టెరిలైజ్ చేసి మళ్లీ వాడటం, వాటిని రీసైక్లింగ్ చేసి ప్లేట్లు, గ్లాసులు, కత్తులు, ఫోర్క్‌లా మారుస్తున్నాయి. అయితే ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారటంతో చిన్న హోటళ్లన్నీ ఈ పనికి స్వస్తి చెప్పేశాయి.
ఏదేమైనా.. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దేశం కరువు బారిన పడక తప్పదని అక్కడి పర్యావరణ వేత్తలు మొత్తుకుంటుండగా, జనం మాత్రం మా సంప్రదాయాన్ని వదిలేది లేదని తేల్చి చెబుతున్నారట.