
Najat Vallaud Belkacem | ఒక దేశం నుంచి మరో దేశానికి కడుపు చేత పట్టుకొని వచ్చిన వలస కూలీ కుటుంబంలో పుట్టి.. తల్లిదండ్రులతో పాటు చిన్నతనంలో పని చేసేది. ఒకప్పుడు కూలీ కోసం గొర్రెల కాపరిగా మారింది. కట్ చేస్తే .. కటిక పేదరికం నుంచి ఏకంగా దేశ విద్యాశాఖ మంత్రి పదవి పొందింది. ఇదంతా చదువుతుంటే ఆమె జీవితం కష్టాల్లో ఉన్నవారికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఆమె భావితరాలకు ఆదర్శం. ఆమె మరెవరో కాదు నజాత్ వల్లౌద్ బెల్కాచెమ్.
ఫ్రాన్స్ దేశానికి ఎడ్యుకేషన్ మినస్టర్‌గా అతిపిన్న వయసులోనే నజాత్ బెల్కాచెమ్ ఎన్నికయ్యారు. ఆమె తొలి మహిళా మంత్రి కావడంతోపాటు తొలి ముస్లిం విద్యా మంత్రిగా కూడా రికార్డ్ సృష్టించారు. వినడానికి వింతగా ఉన్నా.. ఒకప్పుడు ఆమె పేదరికం వల్ల గొర్రెలు కాసేవారు.
నజాత్ 1977 సంవత్సరం మొరాక్కోలో జన్నించారు. ఆమెకు మొత్తం ఏడుగురు సోదుర సోదరీమణలున్నారు. కుటుంబంలో ఆమె రెండవ సంతానం. ఆమె తల్లిదండ్రులు 1982 సంవత్సరంలో మొరొక్కొ దేశం నుంచి ఫ్రాన్స్ దేశానికి కూలీలుగా వలస వచ్చారు. వారు ఫ్రాన్స్‌లోని బిన్‌చికార్ గ్రామంలో నివాసముండేవారు. నజాత్ తండ్రి కూలీ పని చేసేవారు. కుటుంబంలో ఆమె తల్లి, మిగతా సభ్యులు గొర్రెల కాపరిగా పనిచేసేవారు.
18 ఏళ్ల వయసున్నప్పుడు నజాత్‌కు ఫ్రాన్స్ దేశ పౌరసత్వం లభించింది. ఆమె చదువులో బాగా రాణించేది. అందువల్ల ఆమెకు చదువుకోవడానికి కాలేజ్ నుంచి స్కాలర్ షిప్ లభించింది. నజాత్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
చదువుకునే రోజుల నుంచే నజాత్ రాజకీయాలలో పనిచేసింది. ఆమె జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేసింది. 2008లో నజాత్ రాన్ అల్పైన్ నుంచి కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. 2012 సంవత్సరంలో ఆమె మహిళా హక్కుల మినిస్టర్‌గా నియమితులయ్యారు. ఆ తరువాత ఆమె ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తన అధికార ప్రతినిధిగా నియమించారు.
అలా ఆమె తన రాజకీయ ప్రస్థానంలో విజయం సాధిస్తూ వెళ్లారు. 2015 సంవత్సరం ఆగస్టు 25న, ఆమె దేశ విద్యాశాఖ మంత్రి పదవి పొందారు. ఆమె సాధించిన పదవులు అంత సులువుగా రాలేదు. ఆమెను ఎంతో మంది హేళన చేశారు. కొందరు ఆమె మతం గురించి విమర్శిస్తే.. మరికొందరు ఆమె వేసుకునే బట్టల గురించి హీనంగా మాట్లాడారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా నజాత్ మాత్రం తన పనిని అంకితభావంతో చేసింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.