
Retention : ఉద్యోగి ఎవరైనా దీర్ఘకాలం పనిచేయడమనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. వర్క్‌ప్లేస్‌లో పనిచేసేందుకు సానుకూల వాతావరణం, ఆకర్షణీయ వేతనం, ఉద్యోగ భద్రత వంటి అంశాలెన్నో కీలక పాత్ర వహిస్తాయి. మరి ఉద్యోగులను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోతున్నట్టు అమెరికా, బ్రిటన్ దేశాల్లో కంపెనీలను చూస్తే తెలిసిపోతుంది.
ఈ విషయంలో టాప్ 5 సంస్థల్లో మూడు టెక్ దిగ్గజ సంస్థలే ఉండటం గమనార్హం. సగటున చూస్తే.. యాపిల్, అమెజాన్, మెటా కంపెనీల్లో సిబ్బంది పట్టుమని రెండేళ్లు కూడా పని చేయలేకపోతున్నారు. యాపిల్ సంస్థలో ఉద్యోగులు సగటున 1.7 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తున్నారు. కారణాలు ఏవైనా రెండేళ్లు నిండకుండానే ఆ సంస్థకు గుడ్ బై చెప్పేస్తున్నారు.
అమెజాన్, మెటా కంపెనీల్లో 1.8 సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు. ఎలివెన్స్ హెల్త్(1.9 ఏళ్లు), టెస్లా(2 ఏళ్లు) కంపెనీలు అంతే. ఏఎండీ(2.3), సర్వీస్ నౌ(2.3), సేల్స్ ఫోర్స్(2.8), నెక్స్‌టెరా ఎనర్జీ(2.8), ఎస్ అండ్ పీ గ్లోబల్(2.9 సంవత్సరాలు)లో మాత్రం ఉద్యోగులు రెండేళ్లకు మించి పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఆల్ఫాబెట్ సంస్థలో అత్యధికంగా 3.7 సంవత్సరాల వరకు ఉద్యోగులు కుదురుగా ఉండగలుగుతున్నారు. కొవిడ్ అనంతరం 2022లో యాపిల్ సంస్థ వారంలో మూడు రోజులు ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పుడు 67% మంది సిబ్బందికి ఈ నిర్ణయం రుచించలేదు.
బ్రిటన్ కంపెనీలు కూడా ఉద్యోగులను నిలబెట్టుకోవడంలో సతమతమవుతున్నాయి. బ్రిటన్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు ఐదోవంతు (21%) ప్రస్తుతం తాము చేస్తున్న కొలువులతో ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఇక అక్కడి ఉద్యోగుల్లో 47 శాతం మంది నెల తిరిగేసరికి స్వల్ప మొత్తంలోనైనా సేవింగ్స్ చేయలేకపోతున్నారట.