
Delhi Flood news latest live(Today’s breaking news in India) : యమునా నది ఉగ్రరూపం కొనసాగుతోంది. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో ఢిల్లీ వాసులు తట్టా బుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. 45 ఏళ్ల తర్వాత యమునా నది ఉగ్రరూపానికి ఢిల్లీ వీధులు నదిలా మారాయి. నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కాదు.. ఎర్ర కోట వరకు వచ్చేశాయి యమునా నీళ్లు.
208 అడుగులకు పైన నదిలో నీళ్లు ప్రవహిస్తుండటంతో.. ఢిల్లీ గల్లీల్లోకి పోటెత్తింది వరద. యమునా ఘాట్ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎర్రకోట చుట్టూ ఉంటే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆరు, ఏడుగుల వరకు నీళ్లు వచ్చాయి. దీంతో మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది. కరెంట్ నిలిపివేశారు. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకోట వరకు వచ్చిన యమునా నీళ్లు.. ఇంకెంత దూరం వరకు వెళతాయి అనేది కూడా స్పష్టంగా చెప్పకలేకపోతున్నారు అధికారులు. మరో 24 గంటలు ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు అధికారులు.
కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కొన్ని కార్యాలయాలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు.