
Sachin Tendulkar : ఇవాళ ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బర్త్‌డే. క్రికెట్ అభిమానులే కాదు క్రికెట్ అనే పదం తెలిసిన వారికి కూడా సచిన్ అంటే సుపరిచితమే. క్రికెట్ అంటే సచిన్.. సచిన్ అంటేనే క్రికెట్ అనేంతలా కొన్ని జనరేషన్స్‌కు ముద్ర పడిపోయింది. సచిన్ రిటైర్‌మెంట్ తర్వాత… ఆయన ఆట లేకుంటే క్రికెట్ చూడడం మానేసినవారు కూడా ఉన్నారు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న సచిన్… అభిమానులకు ఆరాధ్య దైవం.
క్రికెట్ దేవుడు అని పిలుచుకునే సచిన్ టెస్టుల్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు తన పేరిట నమోదు చేసుకున్నాడు. యూనిక్ బ్యాటింగ్ స్టైల్ ఆయన సొంతం. ఎంతటి భీకరమైన బౌలరైనా సచిన్‌కు బౌలింగ్ చేయాలంటే భయపడాల్సిందే. క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు సచిన్. రెండు దశాబ్దాలకు పైగా అభిమానులను అలరించి, బౌలర్లను భయపెట్టిన క్రికెట్ దేవుడు… ఆటకు వీడ్కోలు పలికి దశాబ్దం దాటినా ఆటపట్ల ఆయనకున్న ఆరాధన ఇప్పటికీ తగ్గలేదు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న సచిన్ ఈరోజుతో తన వయస్సు 49 దాటి హాఫ్ సెంచరీలోకి అడుగుపెట్టారు. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సచిన్‌కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. పదహారేళ్లకే బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. 1987-88లో బాంబే స్కూల్ స్నేహితుడు వినోద్ కాంబ్లీతో కలసి వరల్డ్ రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీల్లో అరంగేట్రంలోనే సెంచరీలతో అతడి పేరు మార్మోగిపోయింది.
24 ఏళ్ల కెరీర్‌లో తొలి మ్యాచ్ ఎలా ఆడాడో… ఆఖరి మ్యాచ్ వరకు అదే అంకితభావాన్ని ప్రదర్శించాడు. సుదీర్ఘ కాలం కెరీర్‌లో కొనసాగిన ఆటగాళ్లు కూడా సచిన్ రికార్డులను నెలకొల్పలేదు. తనకంటే రెట్టింపు వయసు బౌలర్లు వేస్తున్న బంతులను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఆడుతున్న కొద్దీ రాటుదేలి… ఒక్కో మెట్టు ఎక్కి శిఖరాగ్రానికి చేరాడు.
2013 నవంబర్‌లో సచిన్… వెస్టిండీస్‌తో తన వీడ్కోలు టెస్టు ఆడినప్పుడు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. ఆ రోజు సచిన్ చేసిన ప్రసంగం… ప్రతి భారతీయుడి హృదయాలను తాకింది. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టులు, వన్డేలు ఆడడంతోపాటు అత్యధిక పరుగులు, వంద సెంచరీలు సాధించడం లాంటి గొప్ప రికార్డులతో మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌కు అతడు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది.
సచిన్ బర్త్‌డే సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ సచిన్ టెండూల్కర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ట్విటర్‌లో తమ అభిమాన క్రికెటర్‌కు శుభాకాంక్షలతో ట్వీట్ల మోత మోగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విభిన్నంగా సచిన్ పుట్టిన రోజు సంబరాలు జరుపుకుంటున్నారు.
Jagan : నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర .. చంద్రబాబుపై జగన్ సెటైర్లు..