
Abul Kalam Azad : మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చగలిగేది విద్య మాత్రమే. విద్యాతోనే మనిషి అభివృద్ధి చెందుతాడు. ఏటా దేశ వ్యాప్తంగా నవంబర్ 11న ‘జాతీయ విద్యాదినోత్సవం’ జరుపుకుంటారు. మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు.
ఆధునిక విద్యకు ఆద్యుడు ఆజాద్..
దేశంలో విద్యాభివృద్ధికి ఆజాద్ విశేష కృషి చేశారు.1947లో దేశానికి స్వతంత్రం వచ్చాక ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 1958,ఫిబ్రవరి 22న ఆయన చనిపోయే వరకు విద్యాశాఖ మంత్రిగానే ఉన్నారు. ఆ 11 ఏళ్ల పదవీకాలంలో ఆజాద్ ఆధునిక విద్యను, సాహిత్యంలో పరిశోధనలను ప్రోత్సహించారు. లలిత కళలను ప్రోత్సహించడానికి మూడు అకాడెమీలను ఏర్పాటు చేశారు. హిందీలో సాంకేతిక పదాల సంకలనంపై ఆయన దృష్టి సారించారు.
ఆజాద్ సేవలు ఎనలేనివి..
భారత విద్యా రంగానికి ఆజాద్ చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించింది. అంతే కాకుండా భారత విద్యా రంగాన్ని పరిపుష్టం చేసి.. విద్యా విధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన ఆ మహానుభావుడి జన్మదినమైన నవంబరు 11ను‘జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.