
Praggnanandhaa: భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తుదిపోరులో ప్రజ్ఞానందపై దిగ్గజ ఆటగాడు మగ్నస్ కార్లసన్ పై విజయం సాధించారు. అయితే భారత యువ ఆటగాడు ఫైనల్‌లో ఓడినా గొప్ప పోరాటం చేశాడంటూ ప్రముఖులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రజ్ఞానంద స్వదేశానికి చేరుకున్నారు. చెన్నైలోని విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు ఘన స్వాగతం లభించింది. తమిళనాడు క్రీడాశాఖ అధికారులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి.. జాతీయ జెండాలతో ఎదురెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజ్ఞానందకు పూల మాలలు, శాలువాలు, పుష్పగుచ్చాలను అందించేందుకు అభిమానులు పోటీపడ్డారు. తమిళనాడు జానపద నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఇంతటి ఘన స్వాగతంపై చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు ప్రజ్ఞానంద. యువకులు అందించిన జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రజ్ఞానంద ముందుకు సాగారు. మరోవైపు అతని తల్లి నాగలక్ష్మీ తన 18ఏళ్ల కుమారుడికి లభించిన ఘనమైన ఆదరణపట్ల సంతోషం వ్యక్తం చేసింది.
ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. మెమెంటోతో పాటు రూ.30 లక్షల చెక్కును అందించారు. తమిళనాడుతో పాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేశావంటూ ప్రజ్ఞానందను కొనియాడారు సీఎం స్టాలిన్.
మరోవైపు, ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. చదరంగంలో అద్భుతంగా రాణిస్తున్న ప్రజ్ఞాను ప్రోత్సహించేందుకు ఓ కారు బహుమతిగా ఇవ్వమని ఆనంద్ మహీంద్రాను పలువురు సోషల్ మీడియాలో కోరారు. మహీంద్రా థార్ కారును ఇవ్వమని సూచించగా.. అంతకంటే ఖరీదైన ఎక్స్యూవీ 400 ఈవీని నజరానాగా ఇస్తున్నట్టు ఆనంద్ ట్వీట్ చేశారు.