
Rajinikanth: స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను మే 28న ఘనంగా నిర్వహించటానికి ఆయన అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. విజయవాడ కేంద్రంగా జరగబోతున్న ఈ వేడుకలకు టి.డి.జనార్ధన్ అధ్యక్షత వహిస్తారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఎన్టీఆర్ శతాబ్ది వేడులకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నందమూరి బాలకృష్ణ తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేయటం విశేషం.
విజయవాడలోనే ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించటానికి ప్రధాన కారణం.. అది ఆయన పుట్టిన జిల్లా. హీరోగా మద్రాసులో అడుగు పెట్టటాని కంటే ముందు విజయవాడలోనే ఆయన చదువుకున్నారు. అక్కడే తిరిగారని బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ఈ వేడుకలకు తనతో పాటు చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా హాజరు కావచ్చునని తెలిపారు నందమూరి బాలకృష్ణ.
1923 మే 28న సీనియర్ ఎన్టీఆర్ జన్మించారు. గత ఏడాది నుంచే ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని టీడీపీ శ్రేణులు, అభిమానులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ వేడుకలకు సూపర్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలో ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి సినిమాల్లో నటించారు కూడా.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెదేపా శ్రేణులు ఈ ఫంక్షన్‌ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. నటుడిగా తనదైన ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఎన్టీఆర్ తర్వాత తెలుగువారి కోసం తెలుగు దేశం పార్టీని స్థాపించారు. పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారాయన.