
Singer Sunitha : తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితురాలైన సింగర్స్‌లో సునీత ఒకరు. రెండేళ్ల ముందు వరకు సింగిల్ పేరెంట్‌గా ఉంటూ వచ్చిన ఆమె తర్వాత వీరపనేని రామకృష్ణను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు రామకృష్ణ. తనని సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న కె.కె.లక్ష్మణ్ అనే వ్యక్తి బెదిరించారని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలని రామకృష్ణ మొబైల్ నెంబర్‌కు లక్ష్మణ్ అనే వ్యక్తి మెసేజ్ పెట్టారు.
అయితే పరిచయం లేని వ్యక్తితో మాట్లాడటం ఇష్టం లేకపోవటంతో రామకృష్ణ సదరు లక్ష్మణ్‌ను కలవటానికి ఇష్టపడలేదు. తన ఆఫీసుకి వెళ్లి స్టాఫ్‌ను కలవాలని రామకృష్ణ చెప్పారు. అయితే లక్ష్మణ్ ఆ మాటలను పెడ చెవిన పెట్టటమే కాకుండా రామకృష్ణకు కంటిన్యూగా మెసేజ్‌లను పెడుతూ వచ్చారు. ఇది నచ్చని రామృష్ణ..లక్ష్మణ్ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. ఆ తర్వాత లక్ష్మణ్ మరో నెంబర్ నుంచి రామకృష్ణకు మెసేజ్‌లను పెడుతూ వచ్చాడు. కేవలం మెసేజ్‌లను పెట్టటమే కాకుండా, బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారం పరిధి దాటకుండా ఉండాలనే ఉద్దేశంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను సంప్రదించారు.
తనకు, తన కుటుంబానికి లక్ష్మణ్ అనే వ్యక్తి కారణంగా హాని ఉందని పేర్కొంటూ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మణ్ ఎవరనేది ఆరా తీస్తున్నారు. ఇంతకీ లక్ష్మణ్ ఎవరు? ఎందుకు రామకృష్ణను బెదిరిస్తున్నారనే విషయాలపై త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది. సునీత ఇద్దరి పిల్లల్లో కుమార్తె పాటలు పాడటం వైపు ఆసక్తి చూపుతుంది. కొడుకు సినీ రంగంలోకి హీరోగా అడుగు పెడుతున్నారు.