
Measles Vaccine : గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అంటు వ్యాధి మీజిల్స్. దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 2000-21 మధ్య అరకోటి మంది చిన్నారుల ప్రాణాలు నిలిచాయి. అయినా టీకా తీసుకోని వారి సంఖ్య నిరుడు గణనీయంగా ఉండటం కలవరం కలిగిస్తోంది. నిరుడు మన దేశంలోనే 11 లక్షల మంది చిన్నారులు మీజిల్స్ వ్యాక్సిన్‌కు దూరమయ్యారు.
మీజిల్స్‌ను తట్టు, దద్దు, పొంగు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. గతంలో, రెండు మూడేళ్లకు ఒకసారి ఈ వ్యాధి విజృంభించేది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 26 లక్షల మంది మరణించేవారు. 1963లో మీజిల్స్ వ్యాక్సిన్‌ను కనుగొన్న తరువాత తగ్గుముఖం పట్టింది.
2022లో 3.3 కోట్ల మంది శిశువులకు తట్టు టీకా వేయలేదని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ఈ మేరకు సంయుక్త నివేదిక విడుదల చేశాయి. 194 దేశాల్లో డేటాను విశ్లేషించిన అనంతరం ఈ నివేదిక రూపొందింది.
ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ వ్యాక్సిన్ MCV1కు దూరమైన చిన్నారుల్లో 55% పది దేశాల్లోనే ఉన్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. వాటిలో మన దేశం ఒకటి. నైజీరియాలో అత్యధిక సంఖ్యలో 30 లక్షల మంది శిశువులు ఈ టీకా వేయించుకోలేదు. కాంగోలో 18 లక్షల మంది, ఇథియోపియా 17 లక్షలు, భారత్, పాకిస్థాన్ దేశాల్లో 11 లక్షల మంది దీనికి దూరమయ్యారు.
అంగోలా, ఫిలిప్పీన్స్ దేశాల్లో 8 లక్షలు, ఇండొనేసియా 7 లక్షలు, బ్రెజిల్, మడగాస్కర్ దేశాల్లో 5 లక్షల మందికి తట్టు టీకా వేయనే లేదు. 2021లో 22 దేశాల్లో తట్టు ప్రబలగా.. నిరుడు ఆ సంఖ్య 37కి పెరిగింది. మన దేశంలో 2022లో 40,967 మందికి మీజిల్స్ వ్యాధి సోకింది.
ప్రపంచవ్యాప్తంగా నిరుడు 3.3 కోట్ల మంది శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ డోసు మిస్సయ్యింది. వీరిలో 2.2 కోట్ల మంది ఫస్ట్ డోసు వేసుకోలేదు. 1.1 కోట్ల మంది రెండో డోసుకు దూరమయ్యారు. కొవిడ్ స మయంలో తట్టు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించింది. అలా జరగడం 2008 తర్వాత అదే తొలిసారి. ఫలితంగా 90 లక్షల కేసులు వెలుగుచూశాయి. తట్టు కేసుల్లో పెరుగుదల 18%గా నమోదైంది.
ఇక మీజిల్స్ కారణంగా నిరుడు సంభవించిన మరణాలు 1.36 లక్షలు. 2021తో పోలిస్తే మరణాల రేటు 43 శాతం పెరిగింది. గత కొన్నేళ్లుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కుంటుపడటమే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీజిల్స్ కేసులు ఎక్కడ వెలుగుచూసినా.. అది వ్యాక్సినేషన్ మందగించిన కమ్యూనిటీలు, దేశాలకు అత్యంత ప్రమాదకరమే.