Vinayaka Chavithi Special Sweets: మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన అంటే శనివారం నాడు వినాయకుడిని ప్రతిష్టంచబోతున్నారు. ఈ రోజు కోసం దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ తరుణంలో బొజ్జ గణపయ్యకు ఇష్టమైన రకరకాల వంటకాలను తయారచేసి నైవేద్యంగా పెడుతుంటారు. గణపయ్యకు ఇష్టమైన స్వీట్స్ తయారుచేసి పూజలో నైవేద్యంగా పెట్టి పూజిస్తుంటారు. అయితే గణపయ్యకు ఎప్పటిలాగే సాధారణమైన స్వీట్స్ కాకుండా ఈసారి ఇలాంటి స్వీట్స్ తయారుచేసి చూడండి. ఈ స్పెషల్ స్వీట్స్ రెసిపి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రైస్ బర్ఫీ
కావాల్సిన పదార్థాలు :
బియ్యం : 1 కప్పు
నెయ్యి : 1 టీ స్పూన్
బాదం, జీడిపప్పులు : 5 చొప్పున
చక్కెర : 1/4 కప్పు
పాలు : 2 కప్పులు
నీళ్లు : 1 టీ స్పూన్
తయారీ విధానం :
ఒక పాన్ తీసుకుని అది బాగా వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి బియ్యాన్ని వేయించాలి. అది రంగు మారే వరకు వేగించి అనంతరం చల్లార్చి అందులో బాదం, జీడిపప్పులు వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మరొక పాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి, చక్కెరను బాగా కరిగించాలి. అలా చక్కెర పాకం వచ్చే వరకు ఉంచి అనంతరం బియ్యంపిండిని కలిపి బాగా కలపాలి. ఇలా చేసిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి మరికొంత సేపు కలపాలి. అనంతరం అది ఒక నెయ్యి రాసిన గిన్నెలో తీసుకుని సమానంగా నేర్పి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిని కట్ చేస్తే స్వీట్ తయారవుతుంది.
2. షిర్వాలే
కావాల్సిన పదార్థాలు :
బియ్యప్పిండి : 1 కప్పు
కొబ్బరి పాలు : 1 కప్పు
బెల్లం : 1/2 కప్పు
జీలకర్ర పొడి : 1 టీ స్పూన్
కుంకుమ పువ్వు
యాలకుల పొడి : 1/4 టీ స్పూన్
అరిటాకులు
నీళ్లు : 1 1/2 కప్పు
ఉప్పు : సరిపడా
నెయ్యి : 1 టీ స్పూన్
తయారీ విధానం :
ఒక గిన్నెలో కొబ్బరి పాలు తీసుకుని అందులో బెల్లం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, జీలకర్రపొడి, కాసింత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ తీసుకుని దానిలో నీళ్లు మరగబెట్టాలి. అందులో నెయ్యి, చిటికెడు ఉప్పు, బియ్యం పిండిని వేసి బాగా కలపాలి. ఇలా రెండు నిమిషాల పాటు వదిలేసి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అనంతరం దానిని ముద్దగా కలుపుకోవాలి. అందులో కొంచెం పిండి కూడా కలుపుకుంటూ దానిని నూనె పూసి చక్రాలుగా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఆవిరి పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో నూనె పూసిన అరిటాకును వేసి దానిపై బియ్యంపిండితో తయారుచేసిన మిశ్రమాన్ని పెట్టి కొన్ని నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం దానిని ఒక ప్లేట్లోకి తీసుకుని బెల్లం మిశ్రమాన్ని పోసి కాసేపు పక్కన పెట్టుకుంటే షిర్వాలే తయారవుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)