Benefits Of Pomegranate Flowers: దానిమ్మ పండుతో మాత్రమే కాదు దాని చెట్టు నుంచి మొదలుకుని ఆకుల వరకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ ఒక్కటి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. దానిమ్మ పండు, పూలు, ఆకులు, గింజలు, బెరడుతో సహా అన్నీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఇవి అద్భుతంగా తోడ్పడతాయి. అయితే దానిమ్మ గింజలు మాత్రమే కాకుండా దానిమ్మ పువ్వుతో కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
దానిమ్మ పువ్వును చూర్ణంలా తయారుచేసుకుని ఉపయోగిస్తే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనికోసం దానిమ్మ పూజలను కొన్ని రోజుల పాటు ఎండలో ఎండబెట్టి అవి ఎండిన తర్వాత దానిని చూర్ణంలా తయారుచేసుకుని ఉపయోగించాలని అంటున్నారు. అయితే దీనిని ఎలా తయారుచేసుకోవాలి, ఏఏ సమస్యలకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పువ్వు చూర్ణంను తయారుచేసుకుని అర స్పూన్ తీసుకుని అందులో తేనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు దీనిని మెత్తగా చేసుకుని క్రిమి కీటకాలు లేదా అలర్జీలు ఏర్పడిన ప్రదేశంలో రాసుకోవడం వల్ల అవి త్వరగా మానిపోతాయి.
అంతేకాదు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది. మరోవైపు పీరియడ్స్ సమయంలో మహిళలు దీనిని తింటే మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారు. అంతేకాదు కాళ్లు, కీళ్ల నొప్పులు, చేతుల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మరోవైపు దానిమ్మ పువ్వును కషాయం చేసి తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.
దానిమ్మ పువ్వులో బెల్లం కలుపుకుని కషాయంలా తయారుచేసుకుని తీసుకుంటే గ్యాస్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు ఈ పువ్వు చూర్ణంలో తేనెను కలుపుకుని తిన్నా కూడా విరేచనాలు వంటి సమస్యలు తగ్గిపోతాయి. మరోవైపు రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. గుండె సంబంధింత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తరచూ దీనిని కషాయంలా చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)