
Fruit Diet : బరువు తగ్గాలన్నా, శరీరంలో మలినాలను వదిలించుకోవాలన్నా ఫలాహారమే బెస్ట్. పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మన అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు, చర్మానికి నిగారింపు రావడానికి ఇవి దోహదపడతాయి. అయితే మూడు రోజుల పాటు కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది? 72 గంటల్లో శరీరంలో కలిగే మార్పులేమిటి? త్రీ-డే ఫ్రూట్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్లు, విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు(జీవ కణాలను కాపాడే పదార్థాలు) శరీరానికి లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ క్రమబద్ధమవుతుంది. గుండె, శ్వాసకోశం, ఇతర శరీర వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంటాయి. మూడు రోజుల పాటు కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటే ఈ మార్పులను గమనించొచ్చు.
మొదటి రోజు
మనకు ఇష్టమైన, సీజనల్ పండ్లను ఆహారంగా తీసుకున్న తర్వాత 12 గంటలకు ఆ ప్రభావం కనిపించడం ఆరంభమవుతుంది. జీర్ణ ప్రక్రియ ఊపందుకుంటుంది. మల బద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు మటుమాయమవుతాయి. కొద్ది కొద్దిగా పండ్లలోని పోషకాలను శరీరం అరిగించుకుని.. శోషించుకోవడాన్ని గమనించొచ్చు. ఫైబర్ల వల్ల కడుపునొప్పి వంటివి తగ్గుతాయి.
రెండో రోజు
ఫ్రూట్ డైట్‌ను రెండో రోజు కొనసాగించడం వల్ల శరీరంలో కొవ్వు కరిగేందుకు దోహదపడుతుంది. దీనికి కారణం పండ్లలో కేలరీలు తక్కువగా ఉండటమే. నిపుణుల చెప్పే దాని ప్రకారం శరీరం న్యూట్రిషనల్ కిటోసిస్ స్థితికి చేరుతుంది. అంటే నిల్వ ఉన్న ఫ్యాట్.. శక్తిగా మారి శరీరానికి అందుతుంది. అయితే శరీరంలో కొవ్వును కరిగించడానికి కేలరీలను తగ్గించి.. శారీరక శ్రమను పెంచితే ఎంతో మేలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
మూడో రోజు
మూడో రోజు కూడా పండ్లను తింటే ఎంతో ఉత్తేజంగా ఉంటాం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. డీటాక్సిఫికేషన్ ద్వారా మరింత శక్తి లభిస్తుంది. చర్మం ప్రకాశవంతమవుతుంది. వయసు ఎంతగానో తగ్గినట్టు కనిపిస్తుంది.
డీటాక్స్ డైట్‌లో ఏవేం ఉండాలి?
ఉపవాస సమయంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగిన పండ్లను ఆహారంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బెర్రీస్, ఆరెంజెస్, కివీస్, దానిమ్మ పండ్లు అయితే బెస్ట్.
ఇవీ రిస్కులు..
పండ్లు ఆరోగ్యానికి మంచిదే అయినా.. ప్రయోజనాలతో పాటు కొన్ని రిస్కులూ ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ బీ, డీ, జింక్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు వంటి కొన్ని పోషకాలు లోపించే ప్రమాదం ఉంది. పండ్లలో నేచురల్ షుగర్ అధిక పాళ్లలో ఉంటుంది. దీంతో ఫ్రూట్స్‌ను మాత్రమే ఆహారంగా తీసుకొంటే బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. పళ్లనూ దెబ్బతీస్తాయి. ఆరెంజెస్ వంటి పండ్లలో యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్ అరిగిపోతుంది. డైట్ పరిమితం కావడం వల్ల అనారోగ్యకరమైన, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం ఆవురావురుమంటుంటాం. ఇక హైబ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నవారికైతే ఫ్రుటేరియన్ డైట్‌తో చెప్పలేనంత చేటు.