
Heart attacks in children : ఈరోజుల్లో మధ్య వయసు వారి నుండి వృద్ధుల వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో.. అన్ని ఆరోగ్య సమస్యలు స్కూలుకు వెళ్లే పిల్లలో కూడా కనిపిస్తున్నాయి. అంత చిన్న వయసులో కూడా పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు హార్ట్ ఎటాక్ లాంటివి కూడా రావడం శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అందుకే ఈ విషయంపై వారు పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు ఒక విషయాన్ని గమనించారు.
ప్రస్తుతం చిన్న వయసు నుండే పిల్లలు జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడుతున్నారు. చిరుతిండ్లు ఎక్కువగా తినడం, ఎక్కువగా శారీరికంగా ఆరోగ్యకరమైన యాక్టివిటీలలో పాల్గొనకపోవడమే స్కూలు పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్స్ లాంటివి రావడానికి కారణమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. గత కొన్నేళ్లుగా 10 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు కూడా హార్ట్ ఎటాక్స్‌తో చనిపోతున్న కేసులు ఎక్కువవుతున్నాయని స్టడీలో తేలింది. దీనికి కారణం ముఖ్యంగా జంక్ ఫుడే అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా ఇండియాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతోంది. మామూలుగా చిన్నపిల్లలో హార్ట్ ఎటాక్‌కు గురవుతున్న కేసులు ఎక్కువగా లేకపోయినా.. వారి ఆహారపు అలవాట్ల వల్ల వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు మాత్రం పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆహారపు అలవాట్ల విషయంలోనే కాదు.. సోషల్ ఇంటరాక్షన్ విషయంలో కూడా ఈతరం పిల్లల్లో మార్పులు వచ్చాయని వారు అంటున్నారు. బయటికి వెళ్లి వ్యాయామం చేయాలి, పిల్లలతో ఆడుకోవాలి అనే ఆలోచనకంటే ఇంట్లోనే ఉండి వీడియో గేమ్స్ ఆడుకోవడానికే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్తున్నారు.
చిరుతిండ్ల వల్ల పిల్లల శరీరంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పిల్లల లైఫ్‌స్టైలే వారికి పెద్ద శత్రువుగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అలవాట్ల వల్ల వారికి చిన్న వయసులోనే షుగర్, బీపీ లాంటివి కూడా అటాక్ అవుతున్నాయని తెలిపారు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి హాని జరుగుతుంది అనేది అందరికీ తెలిసినా.. వాటిని తినడం మాత్రం మానేయడం లేదని వైద్యులు సైతం విమర్శిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు కూడా పిల్లల్లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయన్నారు.
చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్యలను తగ్గించడానికి జంక్ ఫుడ్‌గా దూరంగా ఉంచడం, రోజూ వ్యాయామం అలవాటు చేయడం మేలు అని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఒకసారి జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన తర్వాత పిల్లలు కూడా అదే కావాలని మారాం చేస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులే వారికి అర్థమయ్యేలా చెప్పాలని అంటున్నారు. తల్లిదండ్రులతో పాటు స్కూళ్లలో టీచర్లు కూడా పిల్లల లైఫ్‌స్టైల్ ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, అప్పుడే చిన్న వయసులో వారికి హానికరమైన వ్యాధులు సోకవని చెప్తున్నారు.