
Food-Shortage : ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా.. ఆహార కొరత వెన్నాడుతూనే ఉంది. 2019-22 మధ్య 12.2 కోట్ల మందికి ఆహార భద్రత కరువైంది. కొవిడ్ మహమ్మారి, ఆపై ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తిండి దొరకలేదు. అధికధరలు, పేదరికం వంటివి పరిస్థితిని మరింత దిగజార్చాయి.
ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యధికులు పౌష్టికాహారానికి దూరమయ్యారు.ఈ విషయంలో మడగాస్కర్ అగ్రభాగాన ఉంది. అక్కడ 97.8% మందికి హెల్దీ డైట్ కరువైంది. సుదీర్ఘకాలంగా ఆ దేశాన్ని కరువు వెన్నాడటమే ఇందుకు కారణం.
ఆ దేశ దక్షిణ ప్రాంతంలో 2019 నుంచీ తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వ్యవసాయరంగం దెబ్బతింది. దానికి తోడు 2021-22 మధ్య వరుసబెట్టిన తుఫాన్లతో పంటలు, కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో చమురు ధరలు.. వాటితో పాటే రవాణా చార్జీలు పెరిగిపోయాయి. వీటి ప్రభావం ఆహార ధరలపై పడింది.
మడగాస్కర్‌లో ఆహార ధరలు మూడేళ్లలోనే 20% మేర పెరిగాయి. 2019 నుంచి ఏటా పది లక్షల మంది ఆహారం అందక అల్లాడిపోతున్నారు. బురుండీ, మలావీ, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, లైబీరియాల్లోనూ ఇంచుమించు పరిస్థితులు ఇలాగే ఉండటంతో.. ఆయా దేశాల్లోనూ ఆహార భద్రత కరువైంది.
బురుండీలో 95.9% మంది సమతులాహారం అందని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నారు. మలావీ(95.9%), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(94.6%), నైజీరియా (93.5%), లైబీరియా(92.8%)ల్లో సరైన ఆహారం లేక జనం అల్లాడిపోతున్నారు. ఇక హైతీ(92.6%), మొజాంబిక్(92.5%), నైగర్(92%), కాంగో(91.5%)ల్లో ప్రజల పరిస్థితి అలాగే ఉంది.