
kitchen Garden : ఇంటి పెరట్లో, గార్డెన్‌లో మొక్కలు పెంచుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు చక్కటి ఆరోగ్యం కూడా సొంతం అవుతుంది. ఇంటి తోటలోనే కాకుండా వంటింట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడా మనకు కావాల్సిన పచ్చదనాన్ని పెంచేయొచ్చు. ఆ మొక్కలేవో చూసేద్దాం రండి.
వామాకు..
ఎక్కడైనా సరే సులువుగా పెరిగే మొక్క వాము. కొమ్మను నాటినా త్వరగా నిలదొక్కుకుంటుంది. ఇది సహజ మౌత్‌ప్రెష్‌నర్‌లా, కడుపు నొప్పికి ఉపశమనంగా పని చేస్తుంది. మంచి సువాసననూ అందిస్తుంది.
కొత్తిమీర..
కూరల్లోకి తాజా కొత్తిమీర కావాలంటే.. ధనియాలను రాయితోనో, చేత్తోనో కాస్త నలిపి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే కుండీల్లో చల్లుకోవాలి. దీన్ని నేరుగా ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు చల్లుతుంటే.. 20 రోజుల్లో మొలకలు వస్తాయి. కాస్త పెరిగాక తెంచుకుని ఎంచక్కా వాడుకోవచ్చు.
పుదీనా..
మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా ఆకులు వాడుకుని వేర్లను మట్టిలో నాటండి. ఆపై కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే క్రమంగా చిగుళ్లు వస్తాయి. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి రోగాల నుంచి పుదీనా ఉపశమనం కలిగిస్తుంది.
తులసి ప్రతి ఇంటి పెరట్లోనో, బాల్కనీలోనో తప్పకుండా తులసి మొక్క ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. దీని నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల కూడా కొన్ని రోగాలను నివారించగలం. పెంచడమూ తేలికే.