
Leptospirosis : మరో జూనోటిక్ వ్యాధి వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) అక్కడి పౌరులను అప్రమత్తం చేసింది. జంతువుల నుంచి సంక్రమించే హ్యూమన్ లెప్టోస్పైరోసిస్ ఓ అరుదైన బ్యాక్టీరియల్ వ్యాధి. జంతువులతో పాటు మానవులు దీని బారిన పడే ప్రమాదముంది.
ముఖ్యంగా ఎలుకల నుంచి సోకే అవకాశాలు ఉన్నాయి. పెంపుడు జంతువులు, పశువులు, ఇతర వన్యప్రాణుల నుంచి కూడా సంక్రమించొచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఇది ప్రబలే అవకాశాలున్నాయి. ప్రధానంగా వర్షాలు అధికంగా కురిసే ఉష్ణమండల ప్రదేశాల్లో ఎక్కువ.
హ్యూమన్, యానిమల్ లెప్టోస్పైరోసిస్ ఇటీవల పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ప్రబలింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. జంతువులు, జలంతో సంబంధం ఉన్న పనులు, లేదా బాహ్యప్రపంచంలో పనులు ఎక్కువగా చేసే వారికి ఈ వ్యాధితో అధిక రిస్క్.
దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ బ్యాక్టీరియల్ వ్యాధి తీవ్రత ఎక్కువ. దక్షిణాదిన పాజిటివిటీ రేట్ 25.6 శాతంగా ఉంది. ఉత్తర, పశ్చిమ, తూర్పు, మధ్య భారత్‌లలో 8.3%, 3.5%, 3.1%, 3.3శాతంగా ఉంది.అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, నిస్సత్తువ, డయేరియా, కళ్లలో ఎరుపుదనం, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.