
No Shave November : మన వ్యవస్థల్లోని లోపాల కారణంగా ఒక్కోసారి దేశంలో మంచివాళ్లే లేకుండా పోతున్నారని అనిపించినా.. కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తుల ఆలోచనలను పరిశీలిస్తే.. సమాజములో సమస్యల మీద స్పందించే వారి సంఖ్య తక్కువేమీ కాదని అర్థమవుతుంది. ఈ నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాటించే ‘నో షేవ్ నవంబర్’ కార్యక్రమం ఈ నమ్మకానికి కనిపించే అనేక ఉదాహరణల్లో ఒకటి.
నో షేవ్ నవంబర్ అంటే.. నవెంబర్ నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా జుట్టును అట్లాగే పెంచేయడం. ఇదే నో షేవ్ నవంబర్ అనే చిన్నపాటి ఉద్యమం లాంటి సామాజిక కార్యక్రమం.
కేన్సర్‌తో బాధపడుతూ, చికిత్స తీసుకునే క్రమంలో చాలామందికి జుట్టు రాలిపోతుంది. కేన్సర్ రోగులు శారీరకంగా, మానసికంగా సంఘర్షణకు లోనవుతారు. దీనికి తోడు చికిత్స సమయంలో జుట్టు రాలిపోవటంతో వారు మానసికంగా మరింత క్షోభకు గురవుతుంటారు.
చికిత్స విజయవంతమై, ప్రాణాలతో బయటపడినా.. జుట్టు లేకుండా నలుగురిలో తిరగటానికి ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఇలాంటి వారి కోసం.. ప్రపంచవ్యాప్తంగా పలువురు నవంబరు నెలంతా తమ జుట్టును కట్ చేయకుండా పెంచి, దానిని కేన్సర్ పేషంట్ల విగ్గులు, సవరాలకోసం అందించటమే ఈ ‘నో షేవ్ నవంబర్’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో 2004లో ప్రారంభమైంది. తొలిరోజుల్లో అక్కడి పట్టణ, నగర యువత దీనిని ఒక ఉద్యమంలా తీసుకుని పనిచేశారు. క్రమంగా ప్రపంచం నలుమూలలా.. ఉన్న స్వచ్ఛంద సంస్థలు దీనిని అందిపుచ్చుకుని అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, అటు సామాజిక పరంగా ఇటు మానవీయతా కోణంలో దీనిని అమలు చేస్తున్నాయి.
ఏటా నవంబరు 7న కేన్సర్ అవగాహనా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కనుక ఈ నెలను ఎంచుకున్నారు. మరి మీరూ ‘నో షేవ్ నవంబర్’కు ఓటెయ్యండి. మరీ ఎక్కువ ఆలోచించాల్సిన పనేమీ లేదు. జుట్టేగా.. పోతే మళ్ళీ వస్తుందిలెండి.