
Homeo Treatment : హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య విధానాల్లో హోమియోపతి ఒకటి. ఇది పుట్టింది జర్మనీలో అయినప్పటికీ.. దీనికి భారత్‌లో లభిస్తున్నంత ఆదరణ ప్రపంచంలో మరే దేశంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. శామ్యూల్ హానిమన్ అనే జర్మన్ దేశీయుడు 1780ల ప్రాంతంలో ఈ వైద్యవిధానాన్ని ప్రారంభించాడు. రెండున్నర శతాబ్దాల చరిత్ర గల ఈ వైద్యవిధానానికి ఎంతో గొప్ప ఆదరణ ఉన్నప్పటికీ.. బలమైన శాస్త్రీయ పునాదులు లేవనే బలమైన విమర్శ కూడా దీనిపై ఉంది. టెక్నికల్‌గా ఈ వాదన నిజమే అయినా.. రోగికి స్పష్టమైన ఉపశమానాన్ని అందిస్తుందని తెలిసిన తర్వాత ఆ విమర్శకు ఎలాంటి స్థానమూ లేదంటారు హోమియో అభిమానులు.
హోమియోపతి అనేది సారుప్య సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఒక మనిషికి రోగం రావటానికి ఎంత సమయం పడుతుందో.. అది తగ్గటానికీ అంతే టైం పడుతుందనేదే.. సారుప్య సిద్ధాంతం. ఏ రోగమూ సడెన్‌గా మనిషికి ఎటాక్ కాదనీ, ఎటాక్ కావటానికి ముందు రోగి జీవక్రియల్లో కొన్ని మార్పులు వస్తాయని హోమియో చెబుతుంది. అందుకే అన్ని వివరాలతో కూడిన క్లినికల్ స్టడీతో బాటు రోగి మానసిక స్థితినీ వైద్యులు విశ్లేషిస్తారు. రోగి మానసిక స్థితిని పట్టించుకోకుండా.. కేవలం రోగానికి చికిత్స చేస్తే ప్రయోజనం ఉండదనేది హోమియో వైద్యవిధానంలోని మరో కీలక అంశం.
ప్రత్యేకతలు
అల్లోపతిలో మాదిరిగా హోమియోలో సర్జరీలు, పెద్దమొత్తంలో మందుల వాడకం ఉండదు.
రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగించటానికి బదులు ఆ రోగాన్ని మూలాలతో సహా తీసేసి, మళ్లీ రాకుండా చేయటానికి హోమియో ప్రాధాన్యత ఇస్తుంది.
శరీరంలోని రోగం పోవాలంటే.. ముందు రోగి మెదడులోని తనకు రోగం ఉందనే భావనను తీసేయాలని హోమియో నమ్ముతుంది.
ఇతర వైద్య విధానాల మాదిరిగా.. ఇందులో తక్షణ చికిత్సలు, తాత్కాలిక ఉపశమానాలకు మందులు ఇవ్వటం ఉండదు. అలాగే.. ఇతర వైద్య విధానాల కంటే రోగాలు నయం కావాటానికి ఎక్కువ సమయం పడుతుంది.
1 . Individualism : ప్రపంచంలో ప్రతి మనిషి మరొకరితో పోల్చలేని శారీరక, మానసిక స్థితిని కలిగి ఉంటాడని, ఒక్కొక్కరికీ ఒక్కోరీతిలో ప్రాణశక్తి ఉంటుందని హోమియో చెబుతుంది. ప్రాణశక్తిలోని వైవిధ్యాన్ని గుర్తించకుండా చికిత్స చేస్తే ఏ ప్రయోజనం ఉండదని హోమియో వైద్యులు చెబుతారు.
- Dynamism : రోగం అనేది బయటినుంచి శరీరంలో చొరబడిన జడ పదార్థం/ ప్రభావం కాదనీ, అది.. శరీరంలోని జీవక్రియల్లో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితి అని హోమియో చెబుతుంది. ప్రాణశక్తిని బలహీన పరిచే ఆ ఇబ్బందికర క్రియలను నియంత్రిస్తే.. మళ్లీ ప్రాణశక్తిని పునరుజ్జీవింపజేస్తే.. పరిస్థితి దానంతట అదే చక్కబడుతుందనేది ఈ విధానంలో కీలక అంశం.
- Totality Of Symptoms : శరీరము, మనస్సు, ప్రాణము.. మూడింటి కలయికే మనిషి. వ్యాధి ఏర్పడినపుడు మూడింటిలో తేడా వస్తుంది. కనుక 3 అంశాలనూ పరిగణనలోకి తీసుకుని రోగాన్ని అంచనా వేయాలి తప్ప.. కేవలం శరీరానికి వైద్యం చేస్తే ప్రయోజనం ఉండదనేది మరో అంశం.
4 . Law Of Similars : ఒక మందు ఆరోగ్యవంతుడిలో ఏ మార్పు తెస్తుందో.. రోగిలోనూ అదే మార్పును నివారించగలుగుతుందని హోమియో చెబుతుంది. దీనినే Like cures Like అంటారు. మన ఆయుర్వేదంలో చెప్పినట్లుగా ఉష్ణం ఉష్ణేన శీతలం, ముల్లును ముల్లుతోనే తియ్యాలి అన్నమాట.
ఆదరణకు కారణాలు
ఇతర వైద్యవిధానాల్లోని మందుల కంటే ఈ మందులు బాగా చౌక. (ఇప్పుడు దీనినీ కార్పొరేట్ వైద్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.)
సరైన మందు వాడితే..త్వరగా, మంచి గుణం కనిపిస్తుంది. ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది.
హోమియో మందులు శరీరానికి హాని చేయవు. ఒకవేళ సరైన మందు వాడకపోతే.. రోగం నయంకాదు తప్ప సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు.
ఈ మందుల తయారీలో ఆర్గానిక్ రసాయనాలే తప్ప కృత్రిమ రసాయనాలుండవు.
రోగ లక్షణాలను అణిచివేయటానికి బదులు.. వాటిని నిర్మూలించే దిశగా ఈ మందులు పనిచేస్తాయి.