
Air pollution : ప్రపంచ దేశాలన్నంటినీ వెన్నాడుతున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. ఢిల్లీ వంటి నగరాల్లో దాని పర్యవసానాలు ఏమిటో చవిచూస్తునే ఉన్నాం. వాయు కాలుష్యం ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తులు, గుండెపై పడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. ఎయిర్ పొల్యూషన్ వల్ల పార్కిన్సన్ వ్యాధి ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం వాయు కాలుష్యం ఏటా 70 లక్షల మంది ఊపిరి తీస్తోంది. కాలుష్య గాలిని పీల్చడం ద్వారా క్రమేపీ ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఆరోగ్యం మందగిస్తుంది. 0.01 మైక్రాన్ల నుంచి 300 మైక్రాన్ల వరకు పర్టిక్యులేట్ మేటర్(PM2.5) మన రక్తంలోకి.. అక్కడ నుంచి ఊపిరితిత్తులకు చేరి.. చివరకు ప్రాణాలనే తీస్తుంది. మెదడులో వాపును కలగజేయడం ద్వారా కణాలను దెబ్బతీస్తుంది. అంతే కాదు.. పార్కిన్సన్స్ వ్యాధిని కలగజేసే ప్రమాదమూ ఉందని ఆ అధ్యయనం పేర్కొంది.
వాయు కాలుష్య కారకాలు రక్తం ద్వారా లేదా ఊపిరి తీసుకోవడం ద్వారా మెదడును చేరి ఎంత అల్లకల్లోలం సృష్టిస్తాయన్నదీ అధ్యయనం వెల్లడించింది. కాలుష్య కారకాలు, టాక్సిన్లు నాడీ వ్యవస్థలో వాపును కలగజేస్తాయి. దీని వల్ల ఆల్ఫా-సిన్యూక్లియన్ అనే ప్రొటీన్ పేరుకుపోతుంది. పార్కిన్సన్స్ వ్యాధిని కలగజేయడంలో ఈ ప్రొటీనే కీలకం. ఇది డోపమెనర్జిక్ న్యూరాన్ల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. అంతిమంగా పార్కిన్సన్స్ వ్యాధికి దారితీసేలా చేస్తుంది.
వాయుకాలుష్యం జీర్ణకోశం వాపునూ కలగజేస్తుందని చెబుతున్నారు. దీంతో ఆల్ఫా-సిన్యూక్లియన్ ప్రొటీన్లు పేరుకుపోయి.. జీర్ణకోశం నుంచి మెదడుకు చేరతాయి. అంతిమంగా డోపమైన్ హార్మోన్‌ను నష్టపోయేలా చేస్తుంది. పార్కిన్సన్స్ అనేది మెదడుకు వచ్చే ఓ రుగ్మత. ఈ వ్యాధి బారిన పడితే శరీర కదలికలపై నియంత్రణ తప్పుతుంది. 50 ఏళ్లు పై బడినవారికి దీని వల్ల ముప్పు ఎక్కువ. అసంకల్పితంగా వణకడం, కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది.
ప్రపంచంలో 92 శాతం కలుషిత వాతావరణంలోనే నివసిస్తున్నారని అంచనా. కాలుష్య వాయువును ఎక్కువగా పీల్చడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ముప్పు 25% పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్టిక్యులేట్ మేటర్, నైట్రిక్ డైఆక్సైడ్ ఎంత ఎక్కువ మొత్తంలో పీలిస్తే.. అంతగా పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. అతి సూక్ష్మమైన కాలుష్యకారకాలు మనం పీల్చే గాలి ద్వారా ఒకసారి రక్తంలో చేరితే చాలు.. అక్కడ నుంచి మెదడుకు చేరి మెదడు కణాలను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో.. వాయుకాలుష్యానికి దూరంగా ఉండటం మేలు. వీలైతే మాస్క్‌లు ధరించడం ఓ అలవాటుగా చేసుకొంటే మరీ మంచిది.