
Food Care : మష్రూమ్స్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కేన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయి. అందుకే ఇవి ఆహారంలో భాగమయ్యాయి. గుండెకు చేటు చేసే కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి పుట్టగొడుగుల్లో ఉండవు. శరీరానికి శక్తినిచ్చే పొటాషియం, విటమిన్ డి, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు మాత్రం పుష్కలం.
ఆల్కహాల్‌తో మష్రూమ్ పదార్థాలను తీసుకోవడం ప్రమాదకరం. ఒక్కోసారి సాధారణ పుట్టగొడుగులు కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. ఏడేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు వీటిని ఇవ్వొద్దు. వాటిని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పిల్లల్లో ఉండవు.
గట్టిగా ఉన్న మష్రూమ్‌లను మాత్రమే మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలి. అవీ తడిగా లేకుండా చూసుకోవాలి. పుట్టగొడుగులను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేయొద్దు. సేకరించిన తరువాత 48 గంటల్లోగా తినేయాలి. పుట్టగొడుగుల్లో 2 వేలకుపైగా జాతులున్నాయి. వాటిలో తినడానికి ఉపయోగపడేవి 25 రకాలే. మన దేశంలో 1970 తర్వాత పుట్టగొడుగులను పెంచడం ఆరంభమైంది. వాస్తవానికి వెయ్యేళ్ల క్రితమే చైనీయులు వీటి పెంపకంలో నైపుణ్యం సాధించినట్టు చరిత్ర చెబుతోంది.
పుట్టగొడుగుల్లో విషపూరితమైనవి కూడా ఉంటాయి. నిరుడు అసోంలో అడవుల్లోని పుట్టగొడుగులు తిని 35 మంది అస్వస్థతులయ్యారు. వారిలో 13 మంది చనిపోయారు. విషపూరిత మష్రూమ్స్‌ని
గుర్తించడం చాలా కష్టం. వాటిలో ఉండే ‘ఎమానిటిన్’ అనే పదార్థం చాలా ప్రమాదకరమైనది. ఎమానిటిన్ కలిగి ఉన్న మష్రూమ్‌లను ‘డెత్ క్యాప్స్’, ‘డిస్ట్రాయింగ్ ఏంజెల్స్’ అని పిలుస్తారు. చాలావరకు మష్రూమ్ మరణాలకు కారణం ఎమానిటిన్ పదార్థమే.
ముదురు రంగు పుట్టగొడుగులు విషపూరితమైనవి అని నమ్ముతారు. కానీ అది వాస్తవ విరుద్ధం. ప్రపంచంలోని చాలా విషపూరిత పుట్టగొడుగులు తెలుపు లేదా గోధుమ వర్ణంలో ఉంటాయి. ‘డిస్ట్రాయింగ్ ఏంజెల్’ రకం పూర్తిగా తెల్లగానే ఉంటుంది. ‘ఎమానిటిన్’ను కలిగి ఉండే మష్రూమ్‌లు ముదురు నారింజ లేదా తెలుపు రంగులో ఉంటాయి.